Saturday, August 13, 2016

ఏలీయా (కాలాలకు అతీతుడును అత్యున్నతుడైన ఓ ప్రవక్త)

ఏలీయా
(కాలాలకు అతీతుడును అత్యున్నతుడైన ఓ ప్రవక్త)
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
రచనా సహకారము :  ఇమ్మానుయేల్‌ రెడ్డి  వాసా
నీ మరణానంతరము నీ ఆత్మ ఎక్కడ వుండబోవుచున్నదో నీకు తెలుసునా?
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించి నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభువుకు అంకితమిస్తున్నాను. -  వాసా శేఖర్‌రెడ్డి
Contents

ముందుమాట

        ప్రియపాఠకులారా!  ఇది చాలా చాలా చిన్న పుస్తకము.  కాని దీనిలో ఉన్నది ఏలీయాలోని శక్తి ఏలీయాను గూర్చిన భవిష్యత్తు.  అన్ని కాలాల వారికి ఇంకా భవిష్యత్తుగానే ఉన్న వ్యక్తి ఏలీయా.  రాజుల కాలమునకు ముందు వారికి సుడిగాలిలో ఆరోహణమయ్యే వ్యక్తిగా భవిష్యత్తులో జరుగు సంఘటనగా ఉన్నాడు.  ఇది రాజుల కాలములో జరిగింది.  నూతన నిబంధనకు ముందు క్రీస్తు ప్రభువు మార్గమును సరాళము చేసి ఇశ్రాయేలీయ దేశము నాశనము కాకుండుటకు వచ్చిన శబ్దముగా భవిష్యత్తులో జరుగు సంఘటనగా ఉన్నాడు.  ఇది నూతన నిబంధన ప్రారంభ కాలములో జరిగింది.  ఇప్పుడు మనకు యుగాంతమునకు ముందు క్రీస్తు ప్రభువు రాకడకు ముందు ఆయన మార్గమును సరాళము చేయు వానిగా తనకు తోడుగా హనోకుతో కలిసి వచ్చుట జరుగును.  ఇది జరగవలసినది.  అంటే భవిష్యత్తు గూర్చిన ప్రవచనములు.  యుగాంతమునకు ముందు ప్రపంచ నాశనము జరగకుండా చేయుటకు వచ్చి నరుల హృదయమును దేవుని వైపు త్రిప్పుట చేస్తాడు.  ఇలా చేసినను వారి మరణానంతరము జనులు తిరిగి సాతాను విశ్వరూపమైన క్రూరమృగమునకు దాసోహులై యుగాంతమునకు కారకులు అగుచున్నారు.  ఇలా స్వభావమున ఒక మనుష్యుడైన ఏలీయా ఇంచుమించు అన్ని కాలాలలో తన ఆత్మ రూపములోను మరియు భౌతిక శరీరములతో ఇద్దరు సాక్షులుగాను నరుల మధ్య క్రియ జరిగించెను, జరిగించును, జరిగిస్తాడు  . . . . .
        ఇలాంటి ప్రవక్తను గూర్చి తెలుసుకొనుట మన జీవితములో ఒక గొప్ప అనుభూతి.  ఈ అనుభూతి మధురముగా ఉంచుకొనుటకు నీతి పరిశుద్ధతతో దేవునిలో జీవించాలి.  లేని యెడల చివరకు మిగిలేది బూడిద అన్నట్లుగా మన ఆత్మీయ జీవితము పాతాళ లోకము అగ్నిగుండములలో చేదు అనుభవమును పొందును.
        ఏది ఏమైనప్పటికి, ఎవరు ఎన్ని ఆలోచనలు చేసిన ప్రవక్తలలో ఏలీయా ఏలీయానే!
                                                           ఇట్లు
                                                        శేఖర్‌ రెడ్డి
                                                                                                        (www.FaithScope.com)

1.  భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలలో ఏలీయా యేసుక్రీస్తు ప్రభువు వలె ......

        ప్రియపాఠకులారా!  క్రీస్తు ప్రభువు తన బోధలో ఇశ్రాయేలీయులకు బోధిస్తూ తాను అబ్రాహాము పుట్టక మనుపే యున్నానని బోధించాడు.  యోహాను 8:56-58,  ''మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెనుఅది చూచి సంతోషించెను అనెను.  అందుకు యూదులు-నీకింకను ఏబది సంవత్సరములైన లేవేనీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగాయేసు-అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.'' అంటే అబ్రాహాము ఆది కాండములోని ఒక విశ్వాసి.  ఈయన విశ్వాసులకు తండ్రిగా ఎంపిక చేయబడినవాడు.  అంటే ఇలాంటి విశ్వాసుల తండ్రియైన అబ్రాహాము కంటే క్రీస్తు ప్రభువు ముందే ఉన్నాడు.  ఎలాఆదిలో వాక్యముగా ఉండి,ఈ వాక్యము వెలుగుగా ప్రసరించి సమస్త సృష్టిని సృజించినట్లుగా వ్రాయబడింది.  యోహాను 1:1-4, ''ఆదియందు వాక్యముండెనువాక్యము దేవునియొద్ద ఉండెనువాక్యము దేవుడై యుండెను.  ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను.  సమస్తమును ఆయన మూలముగా కలిగెను.  కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.  ఆయనలో జీవముండెనుఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.''అటుతరువాత మోషే కాలములో వారికి దాహమును తీర్చు జలము లిచ్చు బండగా వారి వెంట ఉంటూ వచ్చాడు. 1 కొరింథీ 10:4, ''అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి.  ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరిఆ బండ క్రీస్తే.'' అలా ప్రవక్తల కాలములో అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభువు ఈ భూమిపై తన కార్యములను కొనసాగించుట జరిగింది.  ఈ విధముగా ఈ జగత్తును సృజించక మునుపే క్రీస్తు ప్రభువు ఉన్నాడు.
        అలాగే ఏలీయా సంగతిని మనము పరిశోధిస్తే ఏలీయా పాత నిబంధనలోని రాజుల కాలము నాటి ప్రవక్త.  అంటే ఈ ప్రవక్త పాత నిబంధన కాలములో ఉన్నాడు.  కొండ పైన రూపాంతర సందర్భములోను ఏలీయా మోషేతో కలసి క్రీస్తు ప్రభువుతో మాట్లాడు సందర్భములో నూతన నిబంధన కాలములోను ఉన్నారు.  మరి యుగాంతము నకు ముందు ఇద్దరు ప్రవక్తలలో ఒకడిగా ఈ భూమి పైకి వస్తాడని ప్రకటన 11వ అధ్యాయములో తెలియజేస్తుంది  ఇలా క్రీస్తు ప్రభువు ఏ విధముగా అయితే భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలలో ఉన్నాడోఅలాగే ఏలీయా కూడ తన క్రియల ద్వారా ఉన్నాడు.  ఎంత ఉన్నత స్థానమును ఏలీయా పొందాడో మనము గుర్తించాలి. అలాగే మన సంగతిని గుర్తించుకొందము.  మనము కూడ ఈ సృష్టికి పూర్వము పరమాత్మునిలో జీవాత్మగా ఉన్నాము.  కనుకనే మన పేరు జీవగ్రంథములో నమోదు చేయబడి మనలను భూమి పైకి పంపుట జరిగింది.  పరమాత్ముని సన్నిధిలో నివసిస్తూ జీవగ్రంథములో మన పేరు లిఖింపబడి యుండగా ఈ అస్థిరమైనదియు సాతాను నివాసమైన ఈ లోకములో జన్మించుటకు గల కారణము మాచే విరచితమైన గ్రంథమందు చదివి గ్రహించగలరు.  ప్రకటన 3:5, ''జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనునుజీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక,నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.''  ఇందులో మన పేరు ముందుగానే వ్రాయబడియున్నదని మీరు సరియైన రీతిలో విశ్వాసులుగా జీవిస్తేనే మీ పేరు తుడపక అలాగే ఉంచబడునని చెప్పబడింది.  కనుక మనము కూడ ఈ సృష్టికి ముందు జీవాత్మగా ఉన్నాము.  అలా మన పేరు నమోదు జరిగి ఇప్పుడు భూమి పైకి వచ్చుట జరిగింది.  అటుతరువాత మరణము ద్వారా మనము ఈ లోకమును వీడుట జరుగును.  అప్పుడు లాజరు ధనవంతుడు ఉపమానములో వలె మన క్రియల చొప్పున అవి సత్క్రియలైనచో మనము అబ్రాహాము ఒడిలో లేక దుష్రియలకు నరకములో ఓదార్పు లేక బాధలు అనుభవించవలసినదే!  ఇలా మనము కూడ క్రీస్తుతో పూర్వము జీవాత్మగా ఉన్నాముఇప్పుడు ఉన్నాము,భవిష్యత్తులో ఆత్మ రూపములో ఉంటున్నాముఅంటే భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలలో ఉన్నట్లే కదా!
        కాని ఇక్కడ ఒక చిన్న తేడా మనకు వారికి మధ్య ఉన్నది.  వారు ఈ మూడు కాలాలలో వారి క్రియలు భూమిపై కొనసాగుచుంటే మన విషయములో మాత్రము వర్తమాన కాలమైన ఈ కాలములో మాత్రమే కొనసాగుచున్నాయి.  దీనికి కారణము ఏలీయా మనవలె జీవాత్మయైన దేవునిలో అత్యున్నత స్థానమును పొందితే మనము ఈ లోక జీవితములో లోకాన్ని అందులో ఉన్న వాటిని ప్రేమించి 1 యోహాను 2:15-16లో వలె పతనమై తరువాత పశ్చాత్తాపము మారుమనస్సు ద్వారా రక్షింపబడుచు అనేక స్థితులలో ఉన్నత స్థానమును సంపాదించుకొన్నాము.  కనుక ఏలీయా యొక్క స్థానము దేవునిలో చాలా ఉన్నతమైనది.  కనుకనే ఏలీయాలోని విశ్వాసమునిరీక్షణదేవుని పైన ప్రేమకార్యదక్షతపట్టుదల మొదలైనవి ఏలీయాను ఆ స్థితికి తీసుకొని పోగా ఈనాడు ఏలీయా మానవ జ్ఞానమునకు అతీతుడుగా జీవిస్తూ భూమిపై పై మూడు అనగా భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలలో ఏ లోపము లేకుండ ఎటువంటి స్థితిలోను విశ్వాసమునిరీక్షణ,దేవునిపై ప్రేమకార్యదక్షతపట్టుదల మొదలైనవాటిని కొనసాగిస్తూ అత్యున్నత స్థానములోనే నిలుచుచున్నాడు.  అయితే మనము పై విషయాలలో మన మానసిక స్థితిలోని లోపము మనలను తగ్గింపు స్థితికి తీసుకొనిపోతూ చివరకు క్రీస్తు ప్రేమకు దూరమగు స్థితిలోకి వెళ్లుచున్నాము అని గ్రహించి ఏలీయా వలె ఆ స్థితికి వెళ్లుటకుపౌలు చెప్పినట్లుగా - క్రీస్తును పోలి నేను జీవిస్తున్నట్లుగానన్ను పోలి మీరు జీవించండని చెప్పు స్థితికి రావాలని ప్రభువు నామములో కోరుకొనుచున్నాను.

2. ఇశ్రాయేలీయులలో కొందరు - సిలువలో క్రీస్తు ప్రభువు ఏలీయాను పిలుస్తున్నాడనుట  .......

        మత్తయి 27:45-47,  ''మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.  ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు-ఏలీఏలీలామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను.  ఆ మాటకు నా దేవానా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.  అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని-ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.'' ఈ వచనము క్రీస్తు ప్రభువు సిలువ బలియాగమునకు సంబంధించినది.  క్రీస్తు ప్రభువు అప్పటికే సిలువపై యున్నాడు.  ఇంచుమించుగా మూడు గంటల కాలము కూడ గడచిపోయెనని చీకటి కమ్మెనని వ్రాయబడింది.  అంటే క్రీస్తు ప్రభువు ఈ లోకములో శరీర రీత్యా చివరి దశకు చేరుకొన్నట్లుగా అర్థమగుచున్నది.  ఇలాంటి స్థితిలో క్రీస్తు ప్రభువు పై వచనములో వలెఏలీఏలీలామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేయుట జరిగింది.  ఈ విధముగా తండ్రియైన దేవుడు తనను చేయి విడుచుట ద్వారా కలిగిన దానిని గుర్తు చేస్తూ తన రక్షణను సకల నరజాతికి ఇచ్చుటకు కొనసాగిస్తున్నాడు.  ఇంతలో అక్కడ అనగా ఆ చుట్టు ప్రక్కల ఉన్నవారు అనగా ఇశ్రాయేలీయులలో కొందరు ఈ మాటలను విన్నారు.  ఎందుకంటే ఈ మాటలు క్రీస్తు ప్రభువు నెమ్మదిగా చెప్పినవి కావు.  ''బిగ్గరగా కేక వేసెను,'' అని వ్రాయబడుటనుబట్టి అక్కడ చుట్టు ప్రక్కల ఉన్న వారందరికి వినిపించింది.  ఇందులో క్రీస్తు ప్రభువు తండ్రియైన దేవుడు తనను చేయి విడిచెనని చెప్పుకుంటూ,ఇశ్రాయేలీయులలో అప్పటికే వారి జ్ఞాపకాలలో ఎంతో కాలముగా నాటుకొని యున్న సంగతి ఆ సమయములో బయటకు వచ్చింది.  ఏమిటా సంగతి?  ఇశ్రాయేలీయులలో ఏలీయా అనే ఒక ప్రవక్త ఉన్నాడని ఆయన సుడిగాలిలో ఆరోహణమై దేవుడు కొని పోయాడని ఆయన తిరిగి ఈ లోకానికి వస్తాడన్న ఎదురు చూపు వారిలో ఉన్నది.  ఇప్పటికి ఇశ్రాయేలీయులలో క్రీస్తు ప్రభువు ఇంకా వస్తాడనే నమ్మకముతోనే వారు ఉన్నారని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  యోహాను 4:25-26, ''ఆ స్త్రీ ఆయనతో -క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదునుఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు-నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.''  మత్తయి 11:2-14.  అంటే ఆనాటి కాలములోని ప్రజలలో కూడ ఏలీయా వస్తాడు అన్న నమ్మకము వారిలో ఉన్నది.  ఈనాడు ఇశ్రాయేలీయులు క్రీస్తు ప్రభువు ఇంకా రాలేదని ఆయన వస్తాడని ఎలాగైతే ఎదురు చూస్తున్నారో వారు కూడ అలాగే ఎదురు చూస్తుండుటను బట్టిఈ సిలువపై క్రీస్తు ప్రభువు బిగ్గరగా కేక వేసినట్లుగా ఆ మాటలు చెప్పగానే అక్కడి ఇశ్రాయేలీయులలో వారిలోని నమ్మకాలు పాత జ్ఞాపకాలుగా బయటకు వచ్చాయి.  అలా వచ్చుట తోడనే అక్కడ ఉన్నవారు ఏలీయాను పిలుచుచున్నాడని అనుకొన్నట్లుగా వ్రాయబడింది.  అంటే ఇశ్రాయేలీయుల మనస్సులో ఎక్కువ ప్రభావితము చేయగలిగిన ప్రవక్త ఏలీయా అన్న సంగతి మనకు అర్థమగుచున్నది.  ఎన్నో అద్భుతాలు చేసిన మోషే వారికి అప్పుడు గుర్తుకు రాలేదుగాని ఏలీయా మాత్రము వారి మనస్సులో నిలిచియున్నాడనుటకు ఇది ఒక నిదర్శనము.

3. ఇశ్రాయేలీయుల నమ్మకాలలో - ఏలీయాలో క్రీస్తునే రక్షింపగల - సిలువ నుండి దింపగల శక్తి

        మత్తయి 27:49,  ''తక్కినవారు-ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి.''  మార్కు15:36, ''ఒకడు పరుగెత్తి పోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి;ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమనెను.''  
        ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు బిగ్గరగా కేక వేసి పలికిన మాటలను బట్టి ఇశ్రాయేలీయులు తప్పుగా అర్థము చేసుకొనుట ద్వారా వారిలోని నమ్మకాలు బయటపడ్డాయి.  అదే ఏలీయా ఎప్పటికైన వస్తాడన్న ఒక నమ్మకం.  ఇది నిజమే కాని వారు అనుకొన్న సందర్భము ఆ సిలువ బలియాగము కాదని వారికి తెలియదు.  అలా అనుకొని క్రీస్తు ప్రభువుని చిరక ద్వారా చేదు ద్రాక్షారసమును అందించినవాడు పై విధముగా అతనిలో ఏలీయాపై ఉన్న నమ్మకాలను చెప్పుచున్నాడు.  ఏమని?  ''ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమని,''అన్నట్లుగా మార్కు వ్రాయుట జరిగింది.  ఈ మాటకు జతపడిన తక్కినవారు - ''ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి.''  ఈ విధముగా అక్కడ ఉన్న వారి పురాతన ప్రవక్తలు ప్రవచించిన భవిష్యత్తును గూర్చిన నమ్మకాలు బయట పెట్టుచున్నారు.  ఏలీయా వస్తాడన్నట్లు వారిలోని ఒక నమ్మకం.  ఆ ఏలీయా చాలా శక్తిమంతుడనిసిలువపై నుండి దింపగలడని వారి మనస్సులో ఏలీయాకు ఉన్న శక్తిని గుర్తు చేసుకొంటున్నారు.  అంటే ఏలీయా ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఏ స్థాయిలో వారి మనస్సున ఉన్నాడన్నది మనము గ్రహించాలి.  లేకుంటే అక్కడ ఆ మాటలు వారి మధ్య రావు.  కనుక వారందరు ఏలీయా యొక్క శక్తిపై నమ్మకము కలిగి ఏమి జరుగునో చూతమని ఎదురు చూచారు.  కాని ఏలీయా రాలేదు.  ఎందుకు?  ఏలీ!  అంటే యెహోవాయే నా దేవుడని ఆ పేరునకు పరమార్థమున్నది.  ఈ భావముతోనే  క్రీస్తు ప్రభువు తండ్రిని నన్ను ఎందుకు చేయి విడిచావని అడుగుచుంటేవారు తండ్రియైన దేవునికి బదులుగా ఏలీయా అనుకొని వారి మనస్సులోని నమ్మకాలను వెలికి తీస్తూ ఈ విధముగా పలుకుట జరిగింది.  
        దీనిని బట్టి ఒక్కసారి ఊహించండి.  ఏలీయా పాత నిబంధనలో రాజుల కాలము నాటి ప్రవక్త.  ఆయన ఆ రోజులలో చేసిన అద్భుతాలు ఏలీయా విషయములో ఆయన తిరిగి వస్తాడన్న ప్రవచనాలు అన్ని వారి మనస్సులలో నాటుకొని ఉన్నట్లుగా మనకు అర్థమగుచున్నది.  ఇంత జ్ఞానము కలిగిన వీరు వారి ముందు ఉన్న లోక రక్షకుని విషయములో నిర్లక్ష్యం చేయుట కూడ మనము గ్రహించాలి.

4.  ఏలీయాలో మనుష్యులను ఆవరించి దైవక్రియలను చేయించగల శక్తి

        పరిశుద్ధాత్మ నీతిమంతులను ఆవహించి అనేక క్రియలను అద్భుత కార్యములను చేయించగల శక్తి ఉన్నదని బైబిలు గ్రంథములో చదువగలము.  పరిశుద్థాత్మను పొందినవారు అనేక క్రియలు సులువుగా జరిగించగలరు.  వారిలోని ఆ శక్తిని బట్టి పరిశుద్ధాత్మ వారికి అనేక వరములను జ్ఞానవరములుగా అనుగ్రహించి వారి ద్వారా సువార్తను కొనసాగించునని బైబిలు గ్రంథములో చదువగలము.  1 కొరింథి 12:4-11.  అలాగే పాత నిబంధనలోని ఏలీయా కూడ అంతటి దైవశక్తిని పొందినవాడు.  ఎలా?  ఏలీయా తన ఆత్మను శక్తిగా యోహానుకు ఇయ్యగలిగాడు.  అతని ద్వారా అనేక దైవక్రియలు జరిగించగలిగాడు.
        లూకా 1:17, ''మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకునుఅవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పిప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగునుఅతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.''  ఈ విధముగా ఏలీయా యోహానును ఆవరించి దైవకుమారుని మార్గమును సరాళము చేయుటయేగాక దైవకుమారునికి బాప్తిస్మము ఇయ్యగలిగెను అంటే ఏలీయా అను దైవ ప్రవక్త యొక్క శక్తి ఎంత గొప్పదో గ్రహించాలి.  పరిశుద్ధాత్మకు సమానముగా మనుష్యులను ఆవరించి వారి ద్వారా అనేక దైవక్రియలను జరిగించగలడనుటకు యోహాను చరిత్ర సాక్ష్యము.  
        ఇంతకి ఏలీయాలోని ఈ శక్తి ఎవరు ఇచ్చినది?  
        దేవుడే కదా!  
        హెబ్రీ 7:25.

5.  ఇశ్రాయేలీయుల మనస్సులలో ఏలీయా - క్రీస్తు ప్రభువు వారిరువురి రాకను గూర్చిన ప్రశ్న

        యోహాను 1:19, ''నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేమునుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.''  ఈ విధముగా యూదులు యెరూషలేము నుండి కొందరు లేవీయులను యాజకులను ఎంచుకొని బాప్తిస్మమిచ్చు యోహాను నొద్దకు పంపి నీవెవడవని అడిగించారు.  అందుకు - యోహాను 1:20, ''అతడు ఎరుగననక ఒప్పుకొనెను;- క్రీస్తును కానని ఒప్పుకొనెను.''  ఇందులో నాకు ఏమి తెలియదు అని సమాధానము చెప్పక ఖచ్చితముగా నేను క్రీస్తును కానని ఒప్పుకొన్నాడు.  అటుతరువాత - యోహాను 1:21, ''కాగా వారు-మరి నీవెవరవునీవు ఏలీయావా అని అడుగగా అతడు-కాననెను.''  ఈ విధముగా యోహాను తాను ఏలీయాను కూడ కాదని ఒప్పుకొన్నాడు.  అందుకు వారు మరల యోహానును గూర్చి ప్రశ్నిస్తూ నీవు ''ఆ ప్రవక్తవా'' అని అడిగారు.  యోహాను 1:22, ''-నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా-కానని ఉత్తరమిచ్చెను.  కాబట్టి వారు-నీవెవరవు?  మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి.''  అన్నింటికి కానని ఉత్తరమిచ్చాడు.  అయినా వారు వదలలేదు.  యోహాను 1:22-23, ''-నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా-కానని ఉత్తరమిచ్చెను.  కాబట్టి వారు-నీవెవరవు?  మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి.  అందుకతడు-ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.''  ఈ విధముగా చెప్పగా వారు - యోహాను 1:24, ''పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు.''  ఇందులో అన్ని రకాలుగా అడిగిన వీరు చివరగా నీవు క్రీస్తువు కాదు ఏలీయావు కాదు మరి నీవు ప్రవక్తవు కాదు మరి ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అడుగుచున్నారు.  ఇక్కడ యోహానును వారు క్రీస్తువా అంటే కాదన్నాడు.  ఏలీయావా అని అడిగితే కాదన్నాడు.  ఆ ప్రవక్తవా అని అడిగితే ప్రవక్తను కాదన్నాడు.  మరి నీవు ఎవరివి అని అడిగితే తాను ప్రవక్తనని చెప్పక ప్రభువు మార్గమును సరాళము చేయుటకు వచ్చిన ఒకని శబ్దము అతనిది కూడ కాదు అది వేరే వానిది.  అదే ఏలీయా యొక్క ఆత్మ శక్తికి సంబంధించినదిగా చెప్పుచున్నాడు.  ఈ విధముగా వారు ఈయన ప్రవక్త కూడ కాదని అనుకొని నీవు క్రీస్తువు కాదుఏలీయావు కాదుప్రవక్తవు కాదు మరి నీవు ఎవరివి అని అడుగుట జరిగింది.  అంటే ఆనాటి జనులలో క్రీస్తు వస్తాడనిఏలీయా వస్తాడని వారి మనస్సులలో ఎంతగా నాటుకొని ఉన్నదో గమనించాలి.  ఎంతవరకు వారి మనస్సులలో ఉంటే ఏమి లాభము?  చివరకు వారు వచ్చినప్పుడు వారిని ఎవరు అనుసరించారు?

6.  యేసుక్రీస్తును గూర్చి ఇశ్రాయేలీయులు యోహానని, ఏలీయా అని యిర్మీయా వంటి ఒక ప్రవక్త అని అనుకొనుట

        మత్తయి 16:13-14, ''యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి-మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు-కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు,కొందరు ఏలీయా అనియుకొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.''    
        ఈ విధముగా క్రీస్తు ప్రభువు అడుగగాజనులు క్రీస్తును గూర్చి పై విధముగా అనుకొనుచున్నారని శిష్యులు సమాధానమిచ్చారు.  యేసుక్రీస్తు ప్రభువు ఈ స్థితిలో క్రియలు చేయునప్పటికి బాప్తిస్మమిచ్చు యోహానును తల నరికించి చంపుట కూడ జరిగిపోయింది.  అటుతరువాత వెంటనే ఇలా అనేక అద్భుత క్రియలు జరుగుటనువినుట చూస్తున్న జనులు క్రీస్తును గూర్చి అనేక రీతులుగా అనుకొంటున్నారు. కొందరు మృతులలో నుండి యోహాను తిరిగి వచ్చెననిమరికొందరు రానైయున్న ఏలీయా వచ్చెనని ఇలా రాగలిగిన అనేకమంది ప్రవక్తలలో ఒకడనికొందరు యిర్మీయా అయి ఉండవచ్చునని రకరకాలుగా ఆ రోజులలో వారిలోని నమ్మకములను బట్టి అనుకొనుట జరుగుచున్నది.  ఇదే సంగతిని యేసుక్రీస్తు ప్రభువుకు తెలియజేయగా శిష్యులను ప్రత్యేకించి జనులు మీరు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారని ప్రశ్నించుట జరిగింది.  అందుకు మత్తయి 16:16-18, ''అందుకు సీమోను పేతురు-నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.  అందుకు యేసు-సీమోను బర్‌యోనానీవు ధన్యుడవుపరలోక మందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.  మరియు నీవు పేతురువుఈ బండమీద నా సంఘమును కట్టుదునుపాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.''  క్రీస్తు ప్రభువును క్రీస్తుగాను దైవకుమారునిగాను వారు తండ్రియైన దేవుడు బయల్పరచగా గుర్తించినట్లు చెప్పబడింది.  ఇలా వారు గుర్తించిన దాని ఫలితము ఎంత గొప్ప ఆశీర్వాదముగా వారికి అనుగ్రహింపబడినదో మనము గ్రహించాలి.  ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నను ప్రవక్తను ప్రవక్తగా గుర్తించాలి.  క్రీస్తు ప్రభువును క్రీస్తు ప్రభువుగానే గుర్తించాలి.  అలా గుర్తించినవారు అనేక మేలులను పొందుదురనుటకు పేతురే నిదర్శనము.  ఏలీయా నూతన నిబంధనలో యోహానులో ఆత్మగా శక్తిగా వచ్చాడు.  ఆయనను గుర్తించి క్రీస్తు ప్రభువు సాక్ష్యమిచ్చాడు.  కాని దానిని గుర్తించినవారు ఎందరు?  దానిని ఆత్మీయ అంధత్వము అని చెప్పవచ్చును.  దానిని ఆలోచించుకొని గుర్తించినవారు ఉన్నత స్థితిని వరముగా పొందుదురు. ఈ విధముగా ఏలీయా ఇశ్రా యేలీయుల మనస్సులో ఉన్నాడేగాని వారు ఆ సమయమునకు ఆయనను గుర్తించు స్థితిలో వారు లేరు.  ఇశ్రాయేలీయుల మనస్సులో క్రీస్తు ప్రభువు ఉన్నాడుగాని ఆ సమయమునకు అపోహలలో అంధత్వములో ఉన్నారుగాని వారు ఆయనను క్రీస్తుగా గుర్తించు స్థితిలో లేరని మనము గుర్తించాలి.

7.  ఇశ్రాయేలీయులకు ఏలీయాను గూర్చి బోధించినవారు ఎవరు?క్రైస్తవులకు ఏలీయా హనోకు అను ఇద్దరు సాక్షులను గూర్చి బోధించినారు ఎవరు?

        మార్కు 9:11, ''వారు-ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారేయిదేమని ఆయన నడిగిరి.''
        శిష్యులు ఏలీయా ముందు వచ్చి సమస్తము చక్కపెట్టునని శాస్త్రులు ధర్మశాస్త్రము నుండి ఏలీయా క్రీస్తుకు ముందుగా రావలెనని చెప్పుచున్నారు కదా!  అని అడుగుచున్నారు.  అంటే ఇశ్రాయేలీయుల మనస్సు ఏలీయా ఇంతగా ఉండటానికి కారణము శాస్త్రుల యొక్క బోధ అని మనకు అర్థమగుచున్నది.  ఈనాడు క్రైస్తవ సంఘములలో బైబిలులోని వాక్యముల ఆధారముగా బోధించుట మనము చూస్తున్నాము.  ఇలా సంఘాలలో ఉన్నవారందరు రెండవ రాకడకు ముందు ఇద్దరు సాక్షులు వస్తారని ఇంచుమించు ప్రతి ఒక్కరికి తెలుసు.  దీనికి కారణము సంఘములలో పాస్టర్లుగాని పాదర్లుగాను పిలిపించుకొనుచున్నవారుగాని చేసిన బోధ కాదా!  అలాగే మరి కొందరు ఉత్సాహముగా బైబిలు గ్రంథము చదివి అలా వారి మనస్సున ఈ స్థితిని ఈ విధముగా గుర్తించుకొనుట కాదా!  ఇలా రెండు విధములుగా వీరి రాకను ఇప్పటికి ప్రపంచ క్రైస్తవ జనాభా మనస్సులో ఉంది.  అలాగే ఆ రోజులలో క్రీస్తు ప్రభువుకు ముందే ఏలీయా వచ్చునని శాస్త్రులు బోధించుట వలన వారి మనస్సున ఈ విధముగా వారు నిలిచారు.  ఇదే సంగతిని శిష్యులు క్రీస్తు ప్రభువును అడుగుట జరిగింది.

8.  ఏలీయా పట్ల ఇశ్రాయేలీయుల వైఖరిని ఎత్తి చూపిన క్రీస్తు ప్రభువు

         మార్కు 9:12-13, ''అందుకాయన-ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమేఅయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడితృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి?  ఏలీయా వచ్చెననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను.''  
        ఎప్పుడైతే శిష్యులు ఏలీయా గూర్చి అడిగారోవెంటనే క్రీస్తు ప్రభువు ఆ మాట నిజమైనదని చెప్పుచూనే,ఇశ్రాయేలీయుల వైఖరిని ఎత్తి చూపుచున్నాడు.  ఏ విధముగా?  వారు ఎదురు చూచుట కైతే ఎదురు చూస్తున్నారు గాని వారిలో ప్రవక్తలను గుర్తించు స్థితి లేదని ఇశ్రాయేలీయులు ప్రవక్తల పట్ల నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించుట గత చరిత్ర అందరికి తెలిసినదే.  అలాగే ఏలీయా కూడ వచ్చెనని అతనిని ఇశ్రాయేలీయులు తమ కిష్టము వచ్చినట్టుగా అతని యెడల చేసిరనియు క్రీస్తు ప్రభువు చెప్పుచున్నారు.  ఎలా చేసారు?  ఏలీయా బాప్తిస్మమిచ్చు యోహానులో ఆత్మగా శక్తిగా ఈ లోకమునకు వచ్చుట జరిగింది.  ఇది గుర్తించలేని ఇశ్రాయేలీయులు ఆయన ఆత్మగా శక్తిగా ఉన్న బాప్తిస్మమిచ్చు యోహానును వ్యతిరేకించుటయేగాక అందరి ప్రవక్తలవలె చెరలో వేయుట చేశారు.  చివరకు ఒక స్త్రీ కోరిక ప్రకారము హేరోదు రాజు యోహాను తల నరికించి చంపుట జరిగింది.  ఈ విధముగా వారు బాప్తిస్మమిచ్చు యోహానుకు చేస్తే క్రీస్తు ప్రభువు అతనిలో ఉన్న ఏలీయా ఆత్మ శక్తిని గుర్తించాడు కనుక ఇది ఏలీయాకు కూడ జరిగినట్లుగా భావించాడు.  కనుకనే క్రీస్తు ప్రభువు ఇశ్రాయేలీయుల వైఖరిని గుర్తు చేస్తూ ఏలీయా రాకను గుర్తు చేస్తూనే వారు చేసిన పనిని చెప్పుచూ వారు తన పట్ల కూడ అదే విధముగా చేయుదురని చెప్పుచున్నాడు.  
        మత్తయి 17:12-18, ''అయినను ఏలీయా యిదివరకే వచ్చెనువారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరి.  మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను.  అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.  వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని - ప్రభువానా కుమారుని కరుణింపుమువాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు;ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడునీ శిష్యులయొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను.  అందుకు యేసు-విశ్వాసములేని మూర్ఖతరమువారలారామీతో నేనెంతకాలము ఉందును?  ఎంతవరకు మిమ్మును సహింతును?  వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.  అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెనుఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను.''  
        ఈ విధముగా క్రీస్తు ప్రభువు వివరించి చెప్పిన తరువాత వారు బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి గుర్తించగలిగారు.  అలాగే ఏలీయా యొక్క క్రియను గుర్తించగలిగారు.

9.  యాకోబు యోహానును - ఏలీయా చేసిన పనిని చేయుట నీకిష్టమా, అని క్రీస్తు ప్రభువును అడుగుట

        లూకా 9:53-56, ''ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు.  శిష్యులైన యాకోబును యోహానును అది చూచి-ప్రభువాఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞా పించుట నీకిష్టమా అని అడుగగాఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.  అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.''  ఇందులో క్రీస్తు ప్రభువు తన శిష్యులతో కలసి యెరూషలేములో బస చేయాలని అనుకొన్నారుగాని అక్కడ వారిని ఎవరు చేర్చుకొని  ఆతిథ్యము ఇయ్యలేదు.  కనుక వారిలో కొన్ని కోపావేశాలు వచ్చాయి.  శిష్యులు కూడ ఇశ్రాయేలీయులే.  క్రీస్తు ప్రభువు పిలుపును అందుకొనక పూర్వము వీరు శాస్త్రుల బోధ యందు యోహానును ప్రవక్తగా ఆయన బోధలు వినుచుండినవారు.  కొందరు వీటన్నింటికి దూరముగా ఉన్నవారే.  2 రాజులు 1:9-10, ''వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను.  అతడు కొండమీద కూర్చుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి-దైవజనుడానీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.  అందుకు ఏలీయా-నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబది మందికి అధిపతియైన వానితో చెప్పగాఅగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబది మందిని దహించెను.''  కాని యోహాను 1:40-41, 45, ''యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.  ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి-మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి  . . . .  ఫిలిప్పు నతనయేలును కనుగొని-ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమిఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.''  ఇలా శిష్యులుగా చేరినవారు క్రీస్తు అనబడిన మెస్సీయను వెదుకుచున్నవారే.  వీరిలో క్రీస్తును గూర్చిఏలీయానుగూర్చి పాత నిబంధనలోని ప్రవచనములను గూర్చి వారి మనస్సున నింపుకున్నవారే.  వీరు ఆ కాలములో వెదకి క్రీస్తు ప్రభువును కనుగొని ఆయనకు శిష్యులుగా చేరారు.  క్రీస్తు ప్రభువుచే కొందరు పిలిపించుకొన్న తరువాత వారు వెదుకునది ఈయనే అని గుర్తించి చేరారు.  ఏది ఏమైనప్పటికి ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనములపై కొంత జ్ఞానమును అందరు ఇశ్రాయేలీయుల కన్నా ప్రభువు శిష్యులు కలిగి యున్నవారే.  ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును ఆయనతో ఉన్న శిష్యులైన యాకోబు యోహానులు కూడ నిరాదరణకు గురైయ్యారో శిష్యులలో ఏలీయా చేసిన సంగతి గుర్తుకు వచ్చింది.  ఏలీయా రాజుల కాలములో బలిని ఆకాశమునుండి అగ్ని దిగి వచ్చి దహింప చేసెనని వినియున్నారు.  అలాగే ఏలీయా ప్రవక్త 450 మందికి పైగా ప్రవక్తలను వధించెనని వీరికి తెలుసు.  కనుక వీరు ప్రభువుతో అలా అగ్నిని ఆకాశమునుండి దింపి వీరిని నాశనము చేయుట నీకిష్టమా అని అడుగుచున్నారు.  దానికి ప్రభువు వారిని గద్దించుట మనము చదవగలము.  యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములో పదకొండవ అధ్యాయములో ఇద్దరు సాక్ష్యులను గూర్చి వ్రాస్తూ వారిని ఎదిరించినవారిని అగ్నితో దహించెనని వ్రాయుట జరిగింది.  అలాగే యాకోబు 5:17-18లో ఏలీయా శక్తిని వర్ణించుచూనే అతడు కూడ మనవలె స్వభావమున మనుష్యుడే అని వ్రాయుట జరిగింది.  దీనికి కారణము కూడ వారు ప్రభువు కాలములో ఇద్దరు కలసి ఏలీయా వలె శక్తిని ప్రదర్శించాలని తలంచారుగాని ప్రభువు వారిని గద్దించిన తరువాత వారు అది ప్రభువు విషయములో తప్పుగా గ్రహించి ఆ తలాంతును వారికి ఇయ్యలేదని గ్రహించి క్రీస్తు ప్రభువు కోసము హింసింపబడుటకే సిద్ధపడ్డారు.  అలాగే వారిలో నిగూఢమైన మనస్సులోని విషయాలు వారి లేఖలలో బహిర్గతము చేశారు.  క్రీస్తు ప్రభువునందున్న మనము విశ్వాసులుగా జీవించుచు ఎదుటివారు క్రీస్తు ప్రభువును అంగీకరించక పోయినను వారిని నాశనము చేయుటకు కోరుకొనకూడదని గ్రహించాలి.  యోహాను 12:47.

10.  క్రీస్తు ప్రభువు విషయములో - ఏలీయాను గూర్చిన వదంతులు

        మార్కు 6:14-16, ''ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని-బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.  ఇతరులు-ఈయన ఏలీయా అనియుమరికొందరు-ఈయన ప్రవక్తయనియుప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొను చుండిరి.  అయితే హేరోదు విని-నేను తలగొట్టించిన యోహానేఅతడు మృతులలోనుండి లేచి యున్నాడని చెప్పెను.''  ఈ విధముగా క్రీస్తు  ప్రభువు విషయములో అనేక వదంతులు వచ్చాయి.  ఎవరి ఆలోచన తగ్గట్టుగా వారు వదంతులు వ్యాపింపజేశారు.  ఇందులో కొందరు క్రీస్తు ప్రభువును ఏలీయా అనుకొన్నారు.  ఎందుకంటే శాస్త్రులు ఏలీయా వస్తాడని బోధిస్తున్నారు కనుక అది మనస్సులో ఉంచుకొని వారు అలా అన్నారు.  మరికొందరు ఈయన కూడ ఒక ప్రవక్త అని లేకపోతే ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడని అనుకొన్నారు.  అయితే వీరందరికి భిన్నముగా హేరోదు రాజు ఆలోచన విరుద్ధముగా ఉన్నది.  ఎందుకు?  హేరోదు రాజు బాప్తిస్మమిచ్చు యోహాను తలను నరికించాడు కనుక అది తాను చేసినది కనుక అది మనస్సులో ఉంది కనుక అతను క్రీస్తును గూర్చి చర్చించునప్పుడు క్రీస్తు ప్రభువును క్రీస్తు ప్రభువుగా గుర్తించక అతనిని బాప్తిస్మమిచ్చు యోహానుగా వదంతులు వ్యాపింపజేశాడు.  అంతేకాదు.  నేను తల నరికించిన యోహానే మృతులలో నుండి లేచి వచ్చెనని వదంతులు చేస్తున్నాడు.  అంటే ఎవరి మానసిక స్థితిని బట్టి వారు ఇలా ప్రచారమును చేస్తున్నారు.  కనుక మానసికముగ మెరుగైన స్థితిలో ఉన్న అపొస్తలులు మాత్రమే ఆయనను క్రీస్తుగాను దైవకుమారునిగాను గుర్తించుట మనము గమనించాలి.  ఈ స్థితిలో ఉన్న వారందరు ధన్యులే.  అలా కాకుండ ఏదేదో ఊహాలలో వదంతులుగా అనుకొనుట తప్పు.  ఇలాంటివారు ఆత్మీయ అంధకారములో ఉన్నట్లే కదా!  అన్ని తెలుసు కాని గుర్తించుచు సరియైన స్థితిలో జీవించువారు కొందరే!

11. ఏలీయా స్వభావమున

మనవంటి మనుష్యుడే - అపొస్తలుడైన యాకోబు
        యాకోబు ఈ పత్రికను ఎవరికి వ్రాశాడు?  యాకోబు 1:1, ''దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పివ్రాయునది.''  ఇందులో పండ్రెండు గోత్రములలో అన్య దేశాలలో చెదిరియున్న ఇశ్రాయేలీయుల కొరకు వ్రాయుట జరిగింది.  వారి మనస్సులలో ఏలీయాయేసుక్రీస్తులను వారు చాలా ఉన్నత స్థానములో వస్తారన్న భావన వారిలో దృఢముగా నాటుకొని ఉన్నాయి.  అందుకే మనుష్యులు ఉండ వలసిన తీరును ధర్మశాస్త్ర రూపములో క్రీస్తునే గాక ప్రభువు యొక్క నూతన నిబంధన ఉపదేశ రూపములో చెప్పుచూనే దేవుని కుమారునికి క్రియల ద్వారా విశ్వాసాన్ని ప్రకటించ మని చెప్పుట జరిగింది.  ఇలా క్రీస్తు ప్రభువు యొక్క రక్షణ మార్గమును గూర్చి బోధించు చూనే ఇశ్రాయేలీయుల మనస్సులోని రెండవ వ్యక్తిని గూర్చి ప్రస్తావించుచూ - యాకోబు 5:17-18, ''ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడేవర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు.  అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెనుభూమి తన ఫలము ఇచ్చెను.'' అని చెప్పుట జరిగింది.  ఈ లేఖ అంతా విశ్వాసికి ఉండవలసిన తీరును ప్రసావిస్తూనే ఇశ్రాయేలీయుల మనస్సులో నిగూఢమైయున్న ఇద్దరు వ్యక్తులను గూర్చి ప్రస్తావిస్తూ వారిలో ఒకడు మనుష్యకుమారుడేగాని రక్షకుడని ఈయన దైవకుమారుడనిఆయనకు మనలోని విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపమని చెప్పుట చదువగలము.  అలాగే ఏలీయా అను రెండవ వ్యక్తిని గూర్చి ప్రస్తావిస్తూ ఈయన క్రీస్తు ప్రభువు వలె ఆదిసంభూతుడు అదృశ్య దేవుని స్వరూపియు కాదని ఈయన మనవలె స్వభావమున మనుష్యుడనికాకపోతే ఆయనలోని ఆసక్తి దేవుని గూర్చిన తపననరులందరిని దైవమార్గములో నడిపించాలన్న ఆలోచనను బట్టి ప్రభువు ఆయనకు దైవశక్తిని ప్రసాదించుట ద్వారా ఆయన పై విధమైన క్రియలు చేయగలిగెనని చెప్పుచున్నాడు.
        ఇక్కడ యాకోబు చిన్న వ్యక్తి ఏమి కాదు.  ఈయన అపొస్తలులలో ఒకడు.  ఈయన అందరి అపొస్తలుల వలె అనేక అద్భుతములు చేసి క్రీస్తు ప్రభువు సువార్తను ఆయనలో ప్రాణమున్నంత వరకు కొనసాగించినవాడు.  ఇలాంటి యాకోబు ఏలీయా గూర్చి మాట్లాడుచూ - ఏలీయా స్వభావమున మనుష్యుడే అని చెప్పుట జరిగింది.  యాకోబు ప్రభువు నామమున అనేక అద్భుతములు చేసినవాడే కనుక ఇశ్రాయేలీయుల  మనుస్సులో నాటుకొనియున్న సంగతిని ప్రసావిస్తూ ఏలీయా కూడ స్వభావమున మనవంటి మనుష్యుడే అని చెప్పుచున్నాడు.  కనుక ఎవరైన ఏలీయాలోని ఆసక్తి మనలో ఉంటే మనము కూడ అలాగున అద్భుతములు చేయగలమని అలాగే అపొస్తలులమైన మేము కూడ క్రీస్తు నామములో చేయగలుగుచున్నామని అంత మాత్రాన మేము దేవదూతలవలె ప్రత్యేకింపబడిన జాతి కాదనిమా జన్మ స్వభావమున మనుష్య జాతికి చెందినదైనను మా ఆసక్తి పరలోక రీత్యా ప్రభు నామమందుండుట వలన మేము దైవశక్తిని పొందుకొనుట జరిగిందని ఇందులో తెలియజేయుట జరిగింది.

12.  ఏలీయాను గూర్చి మలాకీ ప్రవచనము

        మలాకీ బైబిలు గ్రంథములో పాత నిబంధన కాలము నాటి గ్రంథాలలో చివరి గ్రంథము.  ఇందులో దేవుడైన యెహోవా ఒక దినము నియమించె నని ఆ దినము మహా భయంకరమైనదని ఆ దినము రాక మునుపే ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదునని ప్రవచించి గ్రంథస్థము చేయుట జరిగింది.  ఇంతకి దేవుడైన యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహా దినము ఏది?  2 పేతురు 3:10-12, ''అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును.  ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవునుపంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవునుభూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.  ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుకఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియుపంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియుదేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచుదానిని ఆశతో అపేక్షించుచుమీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.''  ఇందులో ప్రభువు దినము అనగా ఆయన రాకడ దినము దొంగ వలె వచ్చుటఅలాగే దేవుని దినపు రాకడ భయానకమైన నాశనముతో జరుగునని చెప్పబడింది.  ఇది ఒక మహా దినము.  ఈ దినమున ఈ ప్రపంచము భయంకరమైన నాశనమునకు లోనై ఈ శరీర జీవితము అనునది లేకుండ అందరు మరణించుటయేగాక పంచభూతాలుభూమిఆకాశము మొదలైనవన్ని అగ్ని చేత దహించబడునని చెప్పబడింది.
        ఇంతటి భయంకరమైన ఈ దినమును మహాదినమని దానిని తండ్రియైన దేవుడే నియమించెనని మలాకీ తన గ్రంథములో వ్రాయుట జరిగింది.  ఈ దినము తండ్రికి తప్ప తనకు కూడ తెలియదని క్రీస్తు ప్రభువు తెలియజేయుట జరిగింది.  మత్తయి 24:36, ''అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గానియే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.''  ఇంత రహస్యమైన ఈ మహా దినము భయంకరమైనదని దీనికి ముందే దేవుడైన యెహోవా ఏలీయా అను ప్రవక్తను మీ యొద్దకు పంపుతానని వాగ్దాన రూపములో ప్రవచించుట జరిగింది.  ఇదే సంగతి ప్రకటన గ్రంథములో ఇద్దరు సాక్షులు వస్తారని 11వ అధ్యాయములో తెలియజేయుట జరిగింది. కాని ఈ ప్రవచనము దీనిని గూర్చి కాదు.  ఎందుకంటే - మలాకీ 4:6, ''నేను వచ్చిదేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.''  ఇందులో దేవుడైన యెహోవా తానే వచ్చి దేశము అనగా ఇశ్రాయేలీయుల  దేశము శపింపకుండునట్లుగా - అతడు అనగా ఏలీయా వచ్చి తండ్రి హృదయములను పిల్లల తట్టునుపిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని చెప్పుచున్నాడు.  అంటే దేవుడైన యెహోవా ఈ భూమి పైకి ఎప్పుడు వచ్చాడు?  దానికి ముందు ఏలీయా వస్తాడని ఇశ్రాయేలీయుల నమ్మకం.  చూచారా!  ప్రవక్తల ప్రవచనాలను ఇశ్రాయేలీయులు ఎంతగా గుర్తించుకున్నారో!  అందుకే వారు ఏలీయా వస్తాడేమోనని చూచుదుమని నిరీక్షణ కలిగి ఉన్నారు.  ఇంతటి స్థితిలో ఉన్నవారు కూడ దేవుని దృష్టిలో యోగ్యులు కాలేక పోయారు.  ఎందుకు?  వారు ఎవరి కోసమైతే ఎదురు చూచారో వీరిని వారు గుర్తించలేక పోయారు.  నిజముగా దేవుని ఆత్మ కలిగినవారు ఆయనను గుర్తించగలుగుదురు.  క్రీస్తు ప్రభువు పేతురుతో నన్ను దేవుని కుమారుడవని నీవు గుర్తించలేదుగాని నీలోని పరిశుద్ధాత్మ నన్ను గుర్తించునట్లుగా చేసిందని చెప్పబడింది.  మత్తయి 16:15-16, ''అందుకాయన-మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను.  అందుకు సీమోను పేతురు-నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.''  కనుక దేవుడు ప్రవక్తల చేత ప్రవచింపజేశారు.  దానిని ధర్మశాస్త్ర రూపము గ్రంథములుగా ఉంచారు.  అవన్ని చదివి లేక విన్న ఇశ్రాయేలీయుల ప్రజలు ఈనాటి క్రైస్తవుల వలె వారి మనస్సులో అవన్ని గుర్తుంచుకొన్నారు.  కాని ఏమి లాభం?  నిజ దైవసేవకులను అబద్థీకులను గుర్తించు దైవజ్ఞానము వారిలో లేక పతనమైపోతున్నారు.  అలాగే ఇశ్రాయేలీయులు క్రీస్తు ప్రభువు వచ్చినఏలీయా వచ్చిన వారు లేఖనములు చెప్పుచున్నారుగాని గుర్తించు స్థితిలో వారు లేరు.  అలాగే ఈనాడు జరుగుచున్న దైవ కార్యములకు క్రైస్తవులే అడ్డంకిగా లేరా!  అదే ఆ రోజులలో జరిగింది.  ఏది దైవ కార్యము?  ఏది సాతాను కార్యము?  అను గుర్తింపు కలిగిన దైవ జ్ఞానము వారు కలిగి లేరు.  దీనికి కారణము - వారి పెదవులు దైవ వాక్యములను పలుకుచున్నవిగాని వారి హృదయము దేవునికి దూరముగా ఉండడమే.  యెషయా 29:13, మార్కు 7:6.  
        ఇక మలాకీ వ్రాసినట్లుగా దేవుడైన యెహోవా - ''నేను వచ్చిదేశమును శపించకుండునట్లు,'' అని వ్రాయబడింది.  ప్రకటనలో ఎక్కడ యెహోవా దేవుడు నాశనము చేయుటకు వచ్చినట్లుగా లేదు.  కాని క్రీస్తు ప్రభువు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చి తన వాక్యమనే ఖడ్గముతో నాశనమును చేసినట్లుగా మనము ప్రకటన 19:11-21లో చదువగలము.  అక్కడ నాశనము జరిగింది.  దీనికి ముందు కూడ ఏలీయా తనకు తోడుగా ఇంకొక ప్రవక్తతో వచ్చుట జరిగింది.  అలా వచ్చి అనేకులలో మార్పును తెచ్చాడు.  కాని ఈ ప్రపంచమే అటుతరువాత క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు నాశనమైపోతుంది.  కనుక ఈ ప్రవచనము అప్పటి సందర్భమునకు సంబంధించినది కాదు.  
        అలా కాకుండ - క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు నూతన నిబంధన కాలములో కన్య మరియమ్మ ద్వారా జన్మించుట జరిగింది.  ఇలా జరుగుటకు ముందు ఏలీయా ఆత్మ రూపములో యోహానును ఆవరించి తన క్రియను కొనసాగించాడు.  లూకా 1:13-17, ''అప్పుడా దూత అతనితో - జెకర్యా భయ పడకుమునీ ప్రార్థన వినబడినదినీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనునుఅతనికి యోహాను అను పేరు పెట్టుదువు.  అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడైద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగకతన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడైఇశ్రాయే లీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.  మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకునుఅవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పిప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగునుఅతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.''  ఈ విధముగా ఏలీయా తన ఆత్మను శక్తిని యోహానుకు అనుగ్రహించి యోహానులో ఏ జంకు పిరికితనము లేకుండ జనులను గద్దించుచు వారికి నీటి ద్వారా జ్ఞానస్నానము ఇచ్చి మత్తయి 3:11లో వలె వారిలోని పాపముల నిమిత్తము మారుమనస్సు కలిగించి తుడిచిపెట్టుట జరిగింది.  అందుకే యోహాను తన వద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులతో - లూకా 3:7, ''అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూ హములను చూచి-సర్పసంతానమారాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?''  అని అడుగుట చదువగలము.  ఈ విధముగా ''నేను వచ్చి,'' అని తండ్రియైన దేవుడు చెప్పగా - క్రీస్తు ప్రభువు రూపము ఆయన కుమారునిగా జన్మించుట జరిగింది.  దీనికి ముందే ఏలీయా ఆ దేశములో ఉన్న అపవిత్రత వలన సమస్తము నాశనమగునని గ్రహించి దేవుని ఆజ్ఞను పొందినవాడై దేశము నాశనము చెందకుండ ఉండుటకు ముందుగానే యోహానును ఎన్నుకొని ఆయనకు ఏలీయా తన ఆత్మను శక్తిని అనుగ్రహించి దేశములోని వారికి మారుమనస్సు పొందమని బోధించాడు.  అలా మారుమనస్సు పొందుటకు వచ్చిన వారిని గద్దించి వారిని బాప్తిస్మము ద్వారా పాపములు పోగొట్టి దేశమును నాశనము కాకుండ ఇశ్రాయేలీయులను రక్షించాడు.  దేవుడైన యెహోవా యొక్క దృశ్య రూపము క్రీస్తు ప్రభువు అనుటకు ఇంత కన్నా ఆధారము కావాలా!  ఇంతటి మహనీయుడు తాను ఈ లోకమును రక్షించుటకు వస్తున్నాడు కనుక శిక్షించుటకు రాలేదు కనుక ఆయనకు ఎవరు నశించుట ఇష్టము లేదు గనుక ఆయనకు ముందుగా ఏలీయాను ఎన్నుకొని ఆ ఏలీయా యొక్క ఆత్మను శక్తిని మాత్రమే ఉపయోగించుచు దృశ్య రూపములో యోహానును ఎన్నుకొని అతనికి ఆ ఏలీయా ఆత్మను శక్తిని అనుగ్రహించి తద్వారా పిల్లల మనస్సును తండ్రుల వైపు,తండ్రుల మనస్సును పిల్లల వైపు త్రిప్పుట జరిగింది.  ఈ స్థితి రాజును సైతము వదలకుండ గద్దించుట పాపమును ఒప్పుకొని నీ అన్న భార్యను వదిలి వేయమని రాజైన హేరోదును హెచ్చరించాడు.  అంటే ఏలీయా ఆత్మ ఆ శక్తి వలన ఎంత ధైర్యమును యోహాను పొందాడో ఒక్కసారి గ్రహించాలి. ఈ విధముగా భూమిపై ఏలీయా రెండవసారి ఆత్మ రూపములో వచ్చి ఇశ్రాయేలీయుల దేశము నాశనము కాకుండునట్లుగా యోహానును ఆవరించి నీతిని స్థాపించునని తండ్రియైన దేవుడు మలాకీ చేత ప్రవచించుటయేగాక గ్రంథస్థము కూడ చేయించుట జరిగింది.

13.  అంగీకరించగల మనస్సు మీకు ఉంటే రాబోవు ఏలీయా ఇతడే - క్రీస్తు ప్రభువు

        మత్తయి 11:14, ''ఈ సంగతి  నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.  వినుటకు చెవులుగలవాడు వినుగాక.''  ఈ విషయమును బాప్తిస్మమిచ్చు యోహాను తన శిష్యులను పంపగా వారికి క్రీస్తు ప్రభువు తెలియజేయుచున్నాడు.  అందరు యోహానును బాప్తిస్మమిచ్చు యోహానుగా గుర్తిస్తేక్రీస్తు ప్రభువు ఆయనను ఆవరించి తన ఆత్మ శక్తిని ఇచ్చిన ఏలీయాను చూచెను కనుక ఈ బాప్తిస్మమిచ్చిన యోహానులోని ఏలీయాను గుర్తించిఈ యోహానులో ఉన్న ఏలీయాను గూర్చి తెలియజేశాడు.  ఒకసారి క్రీస్తు ప్రభువు తన శిష్యులకు బోధించుచూ తన మరణమును గూర్చి ప్రస్తావించుట జరిగింది.  అప్పుడు పేతురు క్రీస్తు ప్రభువును గద్దించుచూ అలా అనకూడదని వారించసాగాడు.  క్రీస్తు ప్రభువుకు అతనిలో ఉన్న సాతానును గుర్తించి ఛీ!  ఫో!  సాతానా!  అనుటను గూర్చి చదువగలము.  
        మత్తయి16:23, ''అయితే ఆయన పేతురు వైపు తిరిగి-సాతానానా వెనుకకు పొమ్మునీవు నాకు అభ్యంతర కారణమైయున్నావునీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను.''  మార్కు 8:32-33.  అంటే మన ఎదుట కనబడేది పేతురే కాని ఆయనలో సాతాను ఆత్మ రూపములో చేరి తనకు అడ్డుపడుట క్రీస్తు ప్రభువు గుర్తించాడు. కనుక పేతురును పేతురు అని సంబోధించక అతనిని ఆవరించి క్రియ జరిగించుచున్న సాతానును గద్దించుచూ ఛీ!  ఫో!  సాతానా!  అని అనుట జరిగింది.  అంటే క్రీస్తు ప్రభువు ముందు మనము నిలిచిన మనము మనలా కనబడుచున్నను ఆయన దృష్టిలో మనలోని ఆత్మలన్ని ఆయనకు కనబడునని గ్రహించాలి.  అంటే నిన్ను పట్టినవి సాతాను లేక అతని దూతలు కావచ్చు లేక పరిశుద్ధాత్మ కావచ్చు లేక ఏలీయా వంటి ప్రవక్తల ఆత్మలు కావచ్చు.  ఎవరు నీలో ఉండి క్రియ జరిగించుచున్నారో ఆ ఆత్మను క్రీస్తు ప్రభువు గుర్తించగలడు.  అందుకే ఆత్మ శక్తిగా యోహానును ఆవరించి ఉన్న ఏలీయాను గుర్తించి యోహానును ఏలీయాగా సంబోధించుట జరిగింది.  అంతేగాని యోహానే ఏలీయా కాదు.  ఏలీయా మరో జన్మ ద్వారా యోహానుగా జన్మించలేదు.  
        యోహాను ఏలీయాలు ఇద్దరు మనుష్యులు.  అయితే దైవకార్యము నిమిత్తము ఏలీయా దేవుని ఆజ్ఞ ద్వారా తన ఆత్మ శక్తిని యోహానుకు అనుగ్రహించి అతని ద్వారా ప్రభువు మార్గమును సరాళము చేస్తున్నాడు.  కనుక యోహాను అను మనుష్యునిలోని ఏలీయాను గుర్తించిన ప్రభువు అతనిని గూర్చి చెప్పుచూ - మత్తయి 11:10, ''ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నానుఅతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును.  అని యెవనిగూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను.''  అలాగే రాబోవు ఏలీయా కూడ ఇతడే అని చెప్పుట జరిగింది.
        యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని నిత్య జీవమిచ్చుననియు 1 యోహాను 5:20, అంతేగాక మహా దేవుడు తీతు 2:13, మరియు రోమా 9:5లో సర్వాధికారియైన దేవుడై యుండి సకల స్తోత్రములకు అర్హుడై యున్న ఆదిసంభూతుడైన యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిస్మమిచ్చుటకు ఒక మనుష్యునికి శక్తి చాలదు.  అందువల్ల ప్రవక్తయైన ఏలీయా ఆత్మ దేవునియొక్క దివ్యమైన పరిశుద్ధాత్మల యొక్క శక్తులు యోహాను నందు ఏకమై దైవకుమారునికి బాప్తిస్మ కార్యక్రమము జరిగించబడింది.  ఇందులో ఏలీయా తోడ్పాటు చాలా ప్రశస్తమైంది.

14. ఏలీయా ఆత్మ శక్తిని యోహాను పొందిన విధానము - కారణము - సిద్ధపాటు

        యోహాను ఏలీయా ఆత్మను శక్తిని పొందినట్లుగా చదువుకొన్నాము.  లూకా 1:13-17, ''అతనికి యోహాను అను పేరు పెట్టుదువు  . . .  ఏలీయా యొక్క ఆత్మయు శక్తిని  గలవాడై  . . . . '' అని చెప్పబడింది.  ఈ ఏలీయా ఆత్మను శక్తిని యోహాను ఎలా పొందాడు.  అందుకు యోహాను యొక్క సిద్ధపాటు ఎలా పొందాడో తెలుసుకొందము.
పొందుటకు కారణములు :-  
        1. మలాకీ 4:5-6లోని ప్రవచనము.  అంటే దేవుని నిర్ణయం.  ఇలా జరగక పోతే దేశ నాశనము జరుగునని చెప్పబడింది.  ఇలా నాశనమగుట దేవునికి ఇష్టము లేక పోవుట ఒక కారణము.
        2.  ఈ ప్రవచనము నెరవేర్పుకు ఏలీయా ఆత్మ శక్తి అపారము.  ఎందుకంటే ఏలీయా మహా ప్రవక్త.  దేవుని నిర్ణయము ప్రకారము ఏమైన చేయగల సమర్థుడు.  ఇది రెండవ కారణము.
        3.  ఈ ప్రవచన నెరవేర్పు కొరకు దేవుడు యోహానును భూమి పైకి ప్రత్యేక రీతిగా పంపించుట జరిగింది.  యోహాను 1:6, ''దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెనుఅతని పేరు యోహాను.''  అంటే దేవుని రాజ్యములో యోహాను అను జీవాత్మ అనగా మనుష్యుడు అక్కడ ఉన్నట్లు ఈ ప్రణాళిక నిమిత్తము ఆయనను పంపించుట మూడవ కారణము. పై మూడు కారణముల వలన యోహాను ఏలీయా యొక్క ఆత్మను శక్తిని సులభముగా పొందగలిగాడు.  
ఏలీయా యొక్క ఆత్మను శక్తిని పొందుటకు యోహాను యొక్క సిద్ధపాటు :-  
        1.  లూకా 1:80, ''శిశువు ఎదిగిఆత్మయందు బలము పొందిఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.''  ఈ విధముగా ఈ లోక జీవితమును తగ్గించుకొని అరణ్య జీవితమును జీవించాడు.  ఎంతవరకు?  ఆత్మయందు బలము పొందు వరకు!  ఎలా పొందాడు?  ఏలీయా ఆత్మశక్తి యోహానును ఆదేశించి కొంత ఆత్మ శక్తిని యోహానుకు ఇచ్చి యోహాను ఆత్మయందు బలము పొందు వరకు ఆయన అరణ్యములలో జీవించాడు.  లూకా 1:80.  కాని ఈ లోకుల మధ్య పాపపు జీవితమునకు దూరముగా జీవించాడు.
        2.  లూకా 3:1-2, ''తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగానుగలిలయకు హేరోదు చతుర్థాధిపతిగానుఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగానుఅబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగానుఅన్నయుకయపయు ప్రధాన యాజకులుగానుఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.''  దేవుని వాక్యము యోహాను వద్దకు వచ్చు వరకు నిరీక్షణ కలిగి జీవించాడు.  లూకా3:3, ''అంతట అతడు వచ్చిపాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను.''  ఈ విధముగా దేవుని వాక్యము వచ్చిన యోహాను ఏమి చేశాడు?  పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమై బాప్తిస్మము పొందవలెనని ప్రకటించుట జరిగింది.  లూకా 1:17, ''మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును,అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పిప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగునుఅతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.''  ఏలీయా యొక్క ఆత్మను శక్తిని పొందిన తరువాత తండ్రుల హృదయములను పిల్లల తట్టుకునుపిల్లల హృదయమును తండ్రుల తట్టుకును సిద్ధపరచునని చెప్పబడింది. కనుక ఎప్పుడైతే దేవుని వాక్యము యోహాను వద్దకు వచ్చిందో మలాకీ 4:5-6 ప్రకారము దేశము నాశనము కాకూడదు గనుక దేవుని ఆజ్ఞగా మారుమనస్సును గూర్చి బోధించుటను ఏలీయా పొందాడు కనుక ఏలీయా తన ఆత్మను శక్తిని యోహానుకు ఇచ్చాడు.  అటుతరువాత మారుమనస్సును గూర్చి బాప్తిస్మమును గూర్చి ప్రకటించుట జరిగింది.  నిరీక్షణతో జీవించుట యోహాను యొక్క సిద్ధపాటు.
        3.  యోహాను గర్భములోనే పరిశుద్ధాత్మను పొందాడు.  లూకా 1:39-41, ''ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జెకర్యా యింటిలో ప్రవేశించి,ఎలీసబెతుకు వందనము చేసెను.  ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానేఆమె గర్భములో శిశువు గంతులు వేసెను.  అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను-''  ఈ విధముగా పరిశుద్ధాత్మ ప్రభావము యోహానుపై ఉంది కనుక యోహాను నీతిమంతుడు.  ఈ నీతి దేవుని వరములను మనలోకి ఆకర్షిస్తుంది.  ఈ విధముగా నీతిగా జీవించుట కూడ సిద్ధపాటే.  ప్రభువైన యేసు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయునై యున్నాడు.  కనుక నీతిని పరిశుద్ధతలను ఆచరించినవాడు క్రీస్తును అనుసరించినట్లేయగును.  1 కొరింథీ 1:31.
        పై మూడు కారణములు - మూడు విధములైన సిద్ధపాటులో యోహాను ఉండుటను బట్టి ఆయనకు మరో మూడు విధములైన బాధ్యతలు అప్పగింపబడినది.
        అవి ఒకటవ బాధ్యత :-  మారుమనస్సును గూర్చిన బాప్తిస్మమును - పాపక్షమాపణను గూర్చి బోధించుట.  లూకా 3:3.  ఈ విధముగా ప్రకటించుచు ప్రభువు మార్గమును సరాళము చేయవలసిన బాధ్యత.
        రెండవ బాధ్యత :-  యోహాను 1:29-34, ''మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి-ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.  నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడుఆయన నాకంటె ప్రముఖుడు గనుక నా కంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.  నేను ఆయనను ఎరుగ నైతినిగాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను.  మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు-ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితినిఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.  నేను ఆయనను ఎరుగనైతిన గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు-నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.  ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.''  క్రీస్తు ప్రభువును గుర్తించిక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగునప్పుడు ఆయనను గూర్చి సాక్ష్యమియ్యవలసిన బాధ్యత.
        మూడవ బాధ్యత :-  క్రీస్తు ప్రభువుకు నీతి యావత్తు నెరవేర్చుటకు కావలసిన బాప్తిస్మమును ఇయ్యవలసిన బాధ్యత.        
        ఈ విధముగా మూడు కారణములు ఏకమై మూడు విధములుగా సిద్ధపాటులో ఉన్న యోహానును బలపరచగా మూడు బాధ్యతలు క్రీస్తు ప్రభువు విషయములో యోహాను నెరవేర్చుట జరిగింది.  ఈ విధముగా మలాకీ 4:5-6లో చెప్పబడినట్లుగా ఏలీయా ఆత్మశక్తి అదృశ్య రూపములు కనుక దృశ్య రూపములో యోహానును ఉపయోగించుకొని దేశ నాశన సంబంధమైన మహాదినము రాకుండ పిల్లలను తండ్రుల వైపు,తండ్రులను పిల్లల వైపు త్రిప్పిదేవుడైన యెహోవా ఈ లోకములో దైవకుమారునిగా క్రీస్తు రూపములో జన్మించు నాటికి మార్గము సరాళము చేయుట వలన క్రీస్తు ప్రభువు కూడ ఈ లోకములో రక్షణను,పాపక్షమాపణను ఏర్పరచుట జరిగింది.  కనుక క్రీస్తు ప్రభువు రక్షణ ప్రణాళికలో ఏలీయా యొక్క ఆత్మ శక్తి క్రియ జరిగించుటలో ఏలీయా ఎంత శక్తిమంతుడో ఒక్కసారి గ్రహించవలసి యున్నది.  ఎందుకంటే క్రీస్తు ప్రభువు మార్గము సరాళము చేయు విషయములోఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచు విషయములోక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చు విషయములో ఏ అవకతవకలు లేక సంపూర్తిగా నెరవేర్పు చేశాడు.  కనుక క్రీస్తు ప్రభువు విషయములో యోహాను దృశ్య రూపములో నిలువగాఏలీయా ఆత్మ శక్తి అదృశ్య రూపములో క్రియ జరిగించగా యోహాను ఆత్మ యందు బలమును పుంజుకొన్నవాడై ఈ కార్యక్రమమును నెరవేర్చుట జరిగింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు మొదటి రాకడ అనగా రక్షణ ప్రణాళికలో ఆయన మార్గమును సరాళము చేయుటకు పిల్లల మనస్సును తండ్రుల వైపు అలాగే తండ్రుల మనస్సును పిల్లల వైపు త్రిప్పుటలో విజయుడైనాడని గ్రహించాలి.  కాని ఈ రాకడలో ఏలీయా పై విధములైన మూడు బాధ్యతలనే నెరవేర్చాడు గాని తన పూర్తి శక్తిని పాత నిబంధనలో వలె ప్రదర్శించలేదని గ్రహించాలి.  అలాగే క్రీస్తు ప్రభువు కూడ తన శక్తిని ప్రదర్శించక రక్షణ ప్రణాళికను సకల మానవాళికి అనుగ్రహించాడు.

15.  ఏలీయా మోషేలతో క్రీస్తు ప్రభువు కొండపై మాట్లాడుట

        మత్తయి 17:1-8, ''ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.  ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెనుఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.  ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడు చుండిరి. అప్పుడు పేతురు-ప్రభువామన మిక్కడ ఉండుట మంచిదినీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశ మానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెనుఇదిగో ఈయన నా ప్రియకుమారుడుఈయనయందు నేనానందించుచున్నానుఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టి-లెండిభయపడకుడని చెప్పెను.  వారు నులెత్తి చూడగాయేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.''  
        ఇది క్రీస్తు ప్రభువు కాలములో జరిగిన చరిత్ర.  అప్పటికి బాప్తిస్మమిచ్చు యోహానును తల నరికి చంపివేయుట జరిగింది. దాని తరువాత ఈ సంఘటన జరిగింది.  ఇందులో క్రీస్తు ప్రభువు పేతురుయాకోబు,అతని సహోదరుడైన యోహానును తీసుకొని ఒక యెత్తయిన కొండ పైకి వెళ్లాడు.  అంతలో వారు చూచుచుండగనే యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరము చెందుట అక్కడ ఏలీయా మోషేతో కలిసి అగుపడుట జరిగింది.  ఇలా కనిపించుటయేగాక ఏలీయా మోషే ఇద్దరు యేసుక్రీస్తు ప్రభువుతో సంభాషించుట శిష్యులు చూచారు.  అంటే వారు మాట్లాడుచుండగా వీరు చూచిన శిష్యులు.  వీరు వేటిని గూర్చి మాట్లాడారు?  అన్న సంగతి అక్కడ వ్రాయబడలేదు.  కాని ఏదో ఒక చర్చయైతే అక్కడ జరిగి ఉండాలి.  లేకుంటే అంత గొప్పగా ఆ సంఘటన వ్రాయనవసరము లేదు.  ఇక్కడ వీరు చర్చించిన అంశమే క్రీస్తు ప్రభువు బలియాగము లేక నిష్క్రమణ గూర్చి.  ఎలా చెప్పగలము?  లూకా 9:30-31, ''మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరివారు మోషే ఏలీయా అనువారు.  వారు మహిమతో అగపడిఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి.''  మత్తయి 17:9-13, ''వారు కొండ దిగి వచ్చుచుండగా-మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను.  అప్పుడాయన శిష్యులు-ఈలాగైతే  ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.  అందుకాయన-ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమేఅయినను ఏలీయా యిదివరకే వచ్చెనువారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి.  మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను.  అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.''  వారు కొండ దిగి వచ్చుచుండగా క్రీస్తు ప్రభువు తాను మరణించి తిరిగి లేచు వరకు దీనినిగూర్చి చెప్పవద్దు అంటూనే బాప్తిస్మమిచ్చు యోహానులో ఉన్న ఏలీయాకు ఎలా అయితే జరిగిందోఅలాగే తన విషయములోను ఇశ్రాయేలీయులు చేయబోవుచున్నారని వారి చేత ఆ శ్రమలను పొందబోవుచున్నానని చెప్పుచున్నాడు.  ఇలా చెప్పుట ఆ కొండను వారు దిగి వచ్చుచుండగా జరుగుచున్నది.  కనుక ఈ బలియాగమును గూర్చి వారు కొండ పైన చర్చించుట జరిగింది.  
        కనుకనే దానిని కొండ దిగుచూ ఈ బలియాగము జరుగువరకు ఈ సంఘటనలను ఎవరికి చెప్పవద్దని చెప్పుట జరిగింది.  ఈ విధముగా బలియాగమును గూర్చి క్రీస్తు ప్రభువు నిష్క్రమణను గూర్చి చర్చించుటకు ఏలీయా మోషేతో కలిసి కొండ పైకి వచ్చాడంటే వారి శక్తిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.  అది దైవకుమారునితో చర్చించుట వారి శక్తికి నిదర్శనము.  దేవుడు పరిశుద్ధులకు తన ప్రవక్తలను ఏ స్థితికి ఆశీర్వదించునో ఈ సంఘటనే ఒక నిదర్శనము.  తాను చేయు కార్యములను గూర్చి తన ప్రవక్తలతో చర్చించుట - వారికి క్రీస్తు ప్రభువు ఎంతటి అధికారమును ఇచ్చాడో మనము అర్థము చేసుకోవాలి.  దేవునికి పరిశుద్ధులకు ఉన్న అవినాభావ సంబంధమే ఇది.  తన పరిశుద్ధులకు జరగవలసిన సంగతి తెలియకుండ ఏ పని దేవుడు చేయడు.  సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనము చేయుటకు అబ్రాహాము అను పరిశుద్ధునితో చర్చించిన తరువాత దానిని నాశనము చేయుట జరిగింది.  అలాగే ఐగుప్తులో మారణహోమమును జరిగించునప్పుడు మోషేకు తెలియజేసి తనను నమ్మిన ప్రజలను ఎలా రక్షించాలో కూడ తెలియజేసాడంటే దేవుడు తన పరిశుద్ధులకు తన విశ్వాసులను ఎంతగా ప్రేమించునో గుర్తించాలి.  అలాగే సకల జాతి జనుల రక్షణార్థము క్రీస్తు ప్రభువు బలియాగము చేయ నుద్దేశించినప్పుడు క్రీస్తు ప్రభువు మోషే ఏలీయాలతో ఆత్మ రూపాంతరమున కొండపై చర్చించారు.  అలాగే శరీర స్థితి తన శిష్యులతో చర్చించుట జరిగింది.  ఇలా అనేక సంగతులు జరగక ముందే తనయందు పరిశుద్ధ స్థితిలో ఉన్నవారితో చర్చించి ఆ కార్యమును కొనసాగించుదురని అర్థమగుచున్నది.  అందులో భాగముగా శరీర రీత్యా లేక ఈ లోక రీత్యా భౌతిక జీవితములో ఉన్న శిష్యులకు ఆత్మ రీత్యా మోషే ఏలీయాకు తన బలియాగమును తెలియజేయుట జరిగింది.  ఇంత గొప్ప ఉన్నత స్థానమును మన దేవుడు మనకు అనుగ్రహిస్తేమనము ఈ లోక ఆశలకు లోనైసమస్త విషయములో పరిశుద్ధతకు దూరమగుచూ ఉండుట వలన మనకు జరగవలసిన సంగతులు తెలియకున్నవి.  కనుక మనము ముందుగా పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తేసమస్తము మనకు కూడ తెలియజేయబడిన తరువాతే జరుగుతాయని గ్రహించాలి.
        యోహానుకు ప్రవక్తయైన ఏలీయా ఆత్మతోను తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మ అభిషేకముతోను ఈ లోకానికి పంపితే - మరి ఈ గ్రంథకర్తనగు నన్ను నా పుట్టుక నుండియే అపవాది యొక్క శోధనలకు జతపరచి పంపినప్పుడు నా ముప్పది సంవత్సరాల వయస్సులో పరిశుద్ధుల సహాయముతో ప్రభువు నాతో మాట్లాడినప్పుడు ఇది పరలోక మర్మమనియుబయల్పరచబడనిదియు  త శక్తులను ఈ శోధనలతో నా జీవితము నిండి యుంటుందో చెప్పుటకు వీలులేదనియుఅయితే ఒక నాటికి ఈ సమస్త శోధనల నుండి బయటపడి తృప్తికరమైన శాంతి సమాధానములతో నా యందలి ఆనందములతో జీవించు దినములున్నవని ఆయన నన్ను ఓదార్చినాడు.  ఇందునుగూర్చి నా సాక్ష్య జీవితము ఈ భయంకర శోధనలను గూర్చి వివరించబడింది.

16.  యుగాంతమునకు ముందు ఏలీయా

        ప్రకటన 11:3, ''నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదనువారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.''  
        ఇందులో యిద్దరు సాక్షులను గూర్చి చెప్పబడింది.  వీరు దేవుని అధికారమును పొందినవారై భూమి పైకి వచ్చుట జరిగి క్రూరమృగముచే చంపబడుదురని ప్రకటన 11:8, ''వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండునువానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరుఅచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయ బడెను.'' చెప్పబడింది.  అంటే వీరు భూమి పైకి రాగానే వెయ్యిన్ని రెండువందల అరువది దినములు అనగా నలువదిరెండు నెలలు అనగా మూడున్నర సంవత్సర కాలము గోనెపట్ట ధరించుకొని బోధించుదురు.  అంటే వీరి రాక అందరిలో లేదు.  అంటే మనము శిశువుగా తల్లి గర్భము ద్వారా జన్మించిన వయస్సు నుండి పెరిగిజ్ఞానము పొందుట జరిగి మంచి చెడు గ్రహించి దేవుని గూర్చి బోధించుదుము లేక దైవ వాక్యము పొందిన ప్రవచించుదుము.  దీనికి కొంత సమయము పట్టుచున్నది.  కాని ఈ ఇద్దరు సాక్ష్యుల విషయములో వీరు శరీర రీత్యా ప్రత్యక్షముగానే భూమి పైకి వస్తున్నారు.  వచ్చి రాగానే కార్యార్థులై తమ బాధ్యతను నెరవేర్చువారుగా నిరాడంబర జీవితమునకు సాదృశ్యముగా గోనెపట్టను ధరించి బోధించుట జరుగుచున్నది.  అంటే వీరు ఈ లోకమునకు యుగాంతమునకు ముందు అనగా మలాకీ4:5-6లో వలె మహా దినము వలన నాశనము జరుగకుండుటకై వీరిని దేవుడే మరల పంపుచున్నాడు.  కనుక ఈ ఇద్దరు సాక్షులలో ఒకరు ఏలీయా.  ఎందుకంటే ఆయన మార్గమును ఏలీయా సరాళము చేయాలి.  క్రీస్తు కాలములో ఏలీయా ఆత్మ శక్తి  రూపములో యోహాను శరీర రీత్యా పొంది జరిగిస్తేయుగాంతమునకు ముందు ఇంకొక ప్రవక్తను తనకు తోడుగా తెచ్చుకొని శరీర రీత్యా ఇద్దరు తమ క్రియలను భూమిపై కొనసాగిస్తారు.  ఏలీయాఇంకొక సాక్షి ఇద్దరు సాక్షులు శరీర రీత్యా భూమి పైకి పంపాలి అంటే ప్రత్యక్షముగా రావటానికి మన పుట్టుక విధానము అంగీకరించదు.  కనుక వీరు ఒకప్పుడు పుట్టి యుండాలి!  
        అలాగే వారు ఇంకా మరణమును పొందని వారై యుండాలి.  వీరే ఏలీయాహనోకు.  ఏలీయా సుడిగాలిలో ఆరోహణమై పోయాడు.  హనోకు దేవునితో నడుచుకొని పోబడినట్లుగా వ్రాయబడింది.  ఆదికాండము 5:21-24, ''హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.  హనోకు మెతూషెలను కనిన తరువాత మూడువందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.  హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.  హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.''  బైబిలు గ్రంథములో పుట్టి మరణమును చూడని వారు వీరు ఇద్దరు మాత్రమే.  రక్తమాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించు కొనవు.  1 కొరింథీ 15:50, ''సహోదరులారానేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు;క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.''  హనోకు ఏలీయాల శరీరాలు లోక సంబంధమైన అక్షయమైన రక్తమాంసాదులతో కూడినవి.  వారు తమ తమ శరీరాలను ధరించుకొని వచ్చిన వీరిద్దరు తమ శరీరములను ఈ భూమిపై విడువవలసియున్నది అనగా మరణము పొందవలసియున్నది.  ఈ కారణము చేత దేవుడు కొనిపోయిన హనోకుసుడిగాలిలో కనిపించక ఆరోహణమై పోయిన ఏలీయా ఇద్దరు మరణమును ఇంకా చూడలేదు కనుక వీరిని తిరిగి ఇద్దరు సాక్షులుగా శరీరముతో పంపుట జరుగును.  క్రీస్తు కాలములో ఏలీయా ఆత్మగా శక్తి క్రియ జరిగించగాయుగాంతమునకు ముందు హనోకుతో కలసి వస్తాడు.  అప్పుడు శరీరమును కలిగిన పాత నిబంధనలోని ఏలీయా ప్రత్యక్షముగా క్రియ జరిగిస్తాడు.  ఈ వెయ్యిన్ని రెండువందల అరువది దినములు వీరు దైవరాజ్యమును గూర్చి బోధించుటప్రవచించుట వీరి పని.

17.  భూలోకమునకు ఏలీయా, హనోకు ఇద్దరు ప్రభువునకు ముందు

        ప్రకటన 11:4, ''వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.''  పరలోకములో హనోకు ఏలీయాల స్థితిని ఇక్కడ వర్ణించుచున్నారు.  ఏలీయా హనోకు ఇద్దరును రెండు ఒలీవ చెట్లుగానుదీపస్తంభములుగాను వర్ణించబడిరి.  ఈ విధముగా వీరు ప్రభువైన వాని ఎదుట ఉన్నారని చెప్పబడింది. వీరు ఎవరికి రెండు ఒలీవ చెట్లు దీపస్తంభములుగా ఉన్నారు?  భూలోకము నకు.  అంటే ఈ భూలోకమునకు ప్రభువునకు ముందు వీరు పై స్థితిని కలిగి యున్నారు.  పాత నిబంధన కాలములో ఒలీవ చెట్ల నుండి వచ్చు నూనెతో అభిషేకించేవారు.  అంటే వీరిని ఈ చెట్లతో పోల్చుటను బట్టి వీరు దైవ ఆజ్ఞ ననుసరించి అభిషేకించుటలో ప్రత్యేక స్థానము కలిగి యున్నారని మనకు అర్థమగుచున్నది.  క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు కన్య మరియ ద్వారా వచ్చుటకు ముందు అనేకులను దైవ మార్గములోనికి ఏలీయా యోహానును ఆశ్రయించి రప్పించుట జరిగింది.  అలాగే ఆదికాండములో దేవుడంటే ఎవరో తెలియని కాలములో పతన స్థితిలో ఉన్న నరుల మధ్య హనోకు దేవునిలో నడిచి ఆయన ద్వారా సశరీరుడుగా కొనిపోబడుట చాలా గొప్ప కార్యము.  ఈ కారణము వలన అనేకులను దేవుని వైపు నడిపించుట జరుగును.  అలాగే ఏలీయా పాత నిబంధన కాలములో ఆహాబు యెజిబేలు పరిపాలనలో దైవ వ్యతిరేక స్థితిలో ఇశ్రాయేలీయులు ఉండగా వారిని దేవునిలోనికి నడిపింప చేయుటకు ఎన్నో అద్భుతములు చేయుట జరిగింది.  అనేకులు వీరి జీవితము వల్ల దేవునిలో ఎదిగి అభిషేకింపబడినవారే!  కనుక వీరిని రెండు ఒలీవ చెట్లతో పోల్చుట జరిగింది.  
        అలాగే వీరు ఇద్దరు దీపస్తంభములై యున్నారు.  దీపస్తంభము వెలుగు నిచ్చునదిగా క్రీస్తు ప్రభువు బోధించుట జరిగింది.  మత్తయి 5:14-16, ''మీరు లోకమునకు వెలుగైయున్నారుకొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.  మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.  మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.''  కనుక దీపస్తంభము నిరంతరము వెలుగును అందరి మధ్య ప్రసరింప చేయుటకు ఉపయోగించును.  అలాగే ప్రకటన 1:20. ''ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.''  అంటే వీరిని వెలుగును ప్రసరించు దైవసేవకులుగాను ఒక సంఘముగాను వర్ణించుట జరిగింది.  ఒక సంఘము ద్వారా అనేకులు దైవత్వములో ఎదుగుటకు ఉపయోగపడును.  అలాగే వీరు ఇరువురు చేసిన క్రియల వలన అనేకులు మారుమనస్సు పొంది పరలోక రాజ్య ప్రవేశమునకు యోగ్యత పొందుట వీరి ద్వారా జరిగినది కనుక వీరు సంఘముగాను దీపస్తంభములుగాను వర్ణించబడ్డారు.  ఈ విధముగా వీరు ప్రభువైన వాని ఎదుట నిలుచుట వీరి ఉన్నత స్థానమునకు సూచన.

18. యుగాంతముముందు ఏలీయా హనోకు కలసి చేసిన క్రియలు

        ప్రకటన 11:5-6, ''ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.  తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు.  మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకునునానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.''  కాని ఆలాగున జనులను హింసింపలేదు.  0ఏలీయా క్రీస్తు ప్రభువుకు ముందు నూతన నిబంధనలో వచ్చి యోహానును ఆవరించినప్పుడు కూడ పాపులను ఏ విధమైన శిక్షకు గురి చేయలేదు.  దీనికి కారణము తన ఆత్మను శక్తిని యోహానుకు ఇచ్చాడు. లూకా 1:17. ఈ బలమును పొందిన యోహాను శాంత స్వభావుడుగానే ఏ అద్భుతములు చేయక తన్ను తాను తగ్గించుకొని క్రీస్తు ప్రభుపును హెచ్చించాడు. అందుకే యోహాను తనను గూర్చి చెప్పుచూ తాను తగ్గవలసి యున్నదని క్రీస్తు ప్రభువు హెచ్చవలసి యున్నదని బోధించాడు.  ఆ కాలము అలా గడచిపోయింది. హనోకు కూడ దేవునిలో నడిచి ఆయనతో కొనిపోబడి నట్లుగా చెప్పబడినదేగాని అద్భుతములు చేసినట్లుగా చెప్పబడలేదు.  ఆదికాండము 5:24.  కాని ఏలీయా పాత నిబంధనసలో అనేక అద్భుతములు పై వలె జరిగించాడు.  అంతకన్నా ఎక్కువగా యుగాంతమునకు ముందు తన సహ సాక్షితో కలసి క్రియ జరిగించ బోవుచున్నాడు.  తమని చంప జూచినవారిని చంపుచున్నారు.  ఏ విధముగా?  తమ నోటి నుంచే అగ్నిని పంపి దహించుటవర్షము లేకుండ చేయుటనీళ్లను రక్తముగా మార్చుటఅనేక తెగుళ్లతో భూమినిదానిపై జనులను హింసించుట.  ఈ విధముగా ఏలీయా హనోకుతో కలసి వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచించుచు దైవరాజ్యమును అద్భుతముగా ఉన్నత స్థానమునకు కొనిపోవుదురు.  మలాకీ 4:5-6లో చెప్పబడిన విధముగా దేవుని రాకడలో మహా దినమునకు ముందు వీరు వచ్చి నాశనము జరగకుండ ఈ భూలోకమును కాపాడుటకు సర్వశక్తులు ప్రయోగించి నరులను సన్మార్గములో దైవ ప్రజలుగా మార్చుదురు.  ఇంత గొప్ప క్రియలు చేసిన మారని ప్రజలు ఉండరు కదా!  కనుకనే వీరిని దీపస్తంభములుగా వర్ణించాడు.  అనేకులు వీరి క్రియలు ద్వారా మారుమనస్సు పొంది దైవరాజ్యములో చేరుదురు గనుక వారు పొందు అభిషేకమునకు వీరు మూలము కనుక వీరిని ఒలీవ చెట్లుగా వర్ణించబడిరి.  ఈ విధమైన క్రియల చేత ఏలీయా హనోకు సహాయముతో రెండవసారి ఈ భూమి నాశనము కాకుండ ఉండుటకు తన వంతుగా మరోసారి తన ప్రయత్నము చేశాడు.  ఈసారి నరులు ఏ స్థితిలో ఉన్నారంటే దైవ వాక్యమును బోధించుటకు ప్రవచించుటకు వచ్చిన వారిని చంప జూచు స్థితిలో యుగాంతమునకు ముందు ఉన్నారు.  ఇలాంటి వారి మధ్య వారు దైవ రాజ్యమునకు యోగ్యులుగా కొందరిని మలచుచున్నారు.  
        ఈ క్రియల వలన యుగాంతమునకు ముందు చివరి ప్రయత్నముగా ఈ భూలోకమును రక్షించుటకు తమ సర్వశక్తులు ప్రయోగించి అనేకులను దైవమార్గములోనికి మళ్లించుట జరుగును.  ఈ విధముగా దైవరాజ్యము తిరిగి ఈ భూమిపై విస్తరింపు చేయుట వలన ఆ భయంకరమైన మహా దినమును రానీయకుండ ఆపుటకు ప్రయత్నిస్తున్నారు.  
        నూతన నిబంధన కాలములో అనేకులకు మారుమనస్సు కలిగించి ప్రభువు మార్గమును సరాళము చేసి రక్షణకు కారణమయ్యారు.  అలాగే యుగాంతమునకు ముందు ఆ భయంకరమైన ఉగ్రతతో కూడి మహా దినము వలన జరుగు నాశనము నుండి అనేకులను రక్షించుచు క్రీస్తు రెండవ రాకడ మార్గమును సరాళము చేయుటకు వచ్చి తమ క్రియల ద్వారా అనేకులను మార్చుట జరిగింది.  ఇంతగా వీరు భూలోకము కొరకు అది నాశనము కాకుండుట కొరకు వీరు కృషి చేయుట జరుగుచున్నది.  వీరు చేసిన ప్రవచన పరిచర్య వలన ఉజ్జీవింపబడిన విశ్వాసుల తరము క్రీస్తు రాకడ వరకు విశ్వాసముతో కొనసాగింది.  అనగా మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయి నూతన ఆకాశము నూతన భూమి ఏర్పడు వరకు పటిష్ఠతగా నిలిచినట్లు ప్రకటన 21:1లో చదువగలము.

19. ఏలీయా తన సహసాక్షితో కలసి క్రూరమృగముచే చంపబడి శరీరమును విడుచుట

        ప్రకటన 11:7-8, ''వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.  వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండునువానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరుఅచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.''
        ప్రకటన 11:3లో వలె ఏలీయాహనోకు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింప అధికారమును దేవుని నుండి పొందారు.  యేసు ప్రభువు కూడ యోహాను దగ్గర బాప్తిస్మము పొంది పండ్రెండుమంది శిష్యులను చేర్చుకొని జనాంగము మధ్య పరిచర్య జరిగించి సిలువ బలియాగములో ప్రాణము వీడినంత వరకు జరిగిన కాలము మూడున్నర సంవత్సరములు అనగా వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు మాత్రమే.  ఆ కాలములో దేవుని గూర్చి వారు సాక్ష్యము చెప్పుట జరిగింది.  అనేక అద్భుతములు జరిగించారు.  ఎన్నో క్రియలు జరిగించుచు భూలోకము మొత్తము మీద వారు ప్రభావము చూపి అనేకులను దైవరాజ్య వారసులుగా చేయుట జరిగింది.  క్రూరమృగము రూపములో సాతాను వీరితో పోరాడి వారిని చంపుట జరుగునని చెప్పబడింది.  ఇది జరిగిన స్థలము వారి ప్రభువైన క్రీస్తు ప్రభువును సిలువ వేసిన స్థలము.  అనగా యెరూషలేమునకు వెలుపల గొల్గతా అను కొండ ప్రాంతము.  యుగాంతమునకు ముందునకు జనాభా పెరిగి ఆ ప్రాంతమంతా మహా పట్టణముగా మారిపోవునని చెప్పబడింది.  అయితే వారిని ఆత్మ రూపముగా లేక ఉపమాన రీత్యా వీరి క్రియలను బట్టి వారు జరిగించిన కార్యములను బట్టి వారికి సొదొమ ఐగుప్తు అని పేరు.  దీనిని బట్టి వీరు ఆ సంత వీధులలో అగాధము నుండి వచ్చు సాతాను విశ్వరూపమైన క్రూరమృగముతో పోరాడి చివరకు చంపబడుచున్నారు.  రక్తమాంసాదులతో కూడిన శరీరాలతో పరలోక ప్రవేశము చేయ వీలుపడదు.  కనుక వారు తమ సాక్ష్యము ముగించగానే వారిని చంపుటకు సాతానుకు అధికారమిచ్చినట్లు ప్రకటన 6:8 వివరిస్తున్నది.  ఈ విధముగా ఆదికాండములో మొదలైన శరీర జీవితము హనోకు రాజుల కాలములో మొదలైన శరీర జీవితము ఏలీయా ఇద్దరు యుగాంతమునకు ముందు పూర్తి చేసుకొనుట జరిగింది.  రక్తమాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు గనుక వీరు వీరి మట్టి శరీరాన్ని ఈ లోకములో ఈ విధముగా విడుచుట దైవనిర్ణయమై యున్నది.  ఆదికాండము 3:19.

20. ఏలీయా మరణానంతరము వారి శరీరమునకు దుస్థితి

        ప్రకటన 11:9, ''మరియు ప్రజలకునువంశములకునుఆ యా భాషలు మాటలాడువారికిని,జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు.''  కఠినాత్ములైన యుగాంతమునకు ముందు ప్రజలు ఏలీయా అతని సహ సాక్షియైన హనోకుకు జరిగించిన దుస్థితి ఇది.  వారు మూడుదినములన్నర వారి శవములను సమాధి చేయనీయక అడ్డుపడుతున్నారు.  ఇక్కడ అడ్డుపడువారు సాతాను కాదుగాని నరులమైన మనమే.  అలాగే వీరి విషయమై నరులు సంతోషించుచు ఒకరికొకరు ప్రోత్సాహకర బహుమతులు పంచుకొందురని వ్రాయబడింది.  ప్రకటన 11:10, ''ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచుఉత్సహించుచుఒకనికొకడు కట్నములు పంపుకొందురు.''  ఈ విధముగా ఏలీయా హనోకు భౌతిక శరీరములకు నరులచే ఈ దుస్థితి కలుగుచున్నది.
21.  ఏలీయా మరణానంతరము ఏలీయా హనోకుల జీవాత్మలు దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చి ఆ శరీరములో ప్రవేశించుట
        ప్రకటన 11:11-12, ''అయితే ఆ మూడుదినములన్నరయైన పిమ్మట దేవుని యొద్దనుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరివారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను.  అప్పుడు-ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని,మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరివారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి.''  ఈ విధముగా వారి జీవాత్మలు ఆ శరీరములో ప్రవేశించి వారికి నరులు కలిగించిన దుస్థితికి వ్యతిరేకముగా మహోన్నత స్థితిలో తిరిగి ఆరోహణమై వెళ్లుచున్నారు.  నరులు ఒకటి తలుస్తే దేవుడు మరొకటి తలుస్తాడనుటకు ఇది ఒక నిదర్శనం.  యెషయా 55:8-9.  అలాగే నరుని తలంపులు వేరు దేవుని తలంపులు వేరు అనుటకు ఇది ఒక నిదర్శనం.  భూనివాసులందరు వారికి శత్రువులై వారి శరీరమునకు ఈ దుస్థితికి కలిగిస్తేవారందరు చూస్తుండగానే జీవాత్మ వారి శరీరములో ప్రవేశించగా వారు పాదములు ఊని నిలిచి అక్షయ రూపములో వారి శరీరము మార్పు చెంది మహిమ శరీరముగా మారగా వారిని పరలోకమునకు ఎక్కి రమ్మని పిలుపు రాగాదానికి అనుకూలముగా వారు పరలోకమునకు ఆరోహణమై వెళ్లిపోయారు.  దీనిని వారి శత్రువులైన భూజనులందరు శాటిలైట్‌ కార్యక్రమముల ద్వారా చూస్తారని ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పబడింది.  
        ఈ విధముగా వీరు వారి శరీర జీవితమునకు ముగియగా మహిమ శరీర జీవితములోనికి ప్రవేశించుట ద్వారా తిరిగి పరలోకములో మహోన్నత స్థానములో నిలుచుట జరుగును.  ఇందులో ఎటువంటి సంశయము లేదు.

22.  నూతన నిబంధనలోని ఏలీయా రాక - దాని పర్యావసానము.యుగాంతములో ఏలీయా రాక - దాని పర్యావసానము

        క్రీస్తు మొదటి రాకగా ఈ లోకమునకు నూతన నిబంధన కాలములో వచ్చాడు.  దానికి ముందు ఏలీయా యొక్క ఆత్మ శక్తి రూపములో క్రియ జరిగించి ఇశ్రాయేలీయులలో అనేకులలో బాప్తిస్మము ద్వారా మారుమనస్సును కలిగించి క్రీస్తు మార్గమును సరాళము చేయగా - క్రీస్తు ప్రభువు దానినే కొనసాగించి చివరకు ఇశ్రాయేలీయుల చేతిలో సిలువలో మరణించినను సకల మానవ జాతికి రక్షణను దయ చేశాడు.  ఈ విధముగా ఇద్దరును శాంతముగా క్రియ జరిగించిరనుటకు సందేహము లేదు.  అనేకమార్లు క్రీస్తు ప్రభువు కూడ నేను శిక్షించుటకు రాలేదని చెప్పుట జరిగింది.  యోహాను 12:47.  ఈ విధముగా మాలాకీలో ప్రవచించినట్లు ఈ ఇశ్రాయేలీయుల దేశమును నాశనము కానీయకుండ ఏలీయా ముందుగా ఆత్మ రూపములో ఈ భూమి పైకి వచ్చి క్రీస్తు మార్గమును సరాళము చేయుట ద్వారా రక్షించగలిగాడు.
        ఇక యుగాంతమునకు ముందు సమస్త భూలోకము సాతానుచే బంధింపబడి క్రీస్తును అనుసరించువారు కరువైన స్థితికి వచ్చింది.  ఇలాంటి స్థితి క్రీస్తు ప్రభువు రెండవ రాకడకు సంసిద్ధము కాగా ఏలీయా ఈ భూమిని నాశనము నుండి తప్పించుటకు మరల దేవుని యొద్ద నుండి అధికారమును పొంది వెయ్యిన్ని రెండు వందల అరువది దినములు ఈ భూమిపై ప్రవచించి ఇంచుమించు అందరిని క్రీస్తు మార్గమునకు త్రిప్పి,వ్యతిరేకించినవారిని కఠినముగా బాధించి తిరగబడిన వారిని క్రూరముగానే అగ్నితో దహించి వేస్తూ తన క్రియలను కొనసాగించి క్రీస్తు మార్గమును రెండవసారి సరాళము చేసి సమస్తమును నీతిగా మార్చుట చేశాడు.  ఇంత భయంకరముగా జరిగించాలా?  అన్న తలంపు మనకు కలుగవచ్చును.  దీనికి కారణము ఒక్కటే.  వీరు రాక ముందు ఉన్న నరుల స్థితిలో యుగాంతమునకు కొద్దిగ దూరములో అందరు ఉన్నారు  ఈ భూలోకమును రక్షించుటకు సమస్త ప్రాణుల నాశనము జరగనీయకుండ రక్షించాలన్న తలంపుతో వీరు ప్రయత్నించగా నరుల హృదయ కాఠిన్యము పతాక స్థాయిలో ఉండుట వలన వారి ప్రతిఘటన వారికే హాని చేసే స్థాయికి తిరుగగావారిని వదిలితే ఈ భూమి ఇక నిలువదని గ్రహించి వారి క్రియలు అంత కఠినముగా కొనసాగించారు.  ఇంచుమించు అందరిలో మార్పును కలిగించగలిగారు.  కనుక క్రీస్తు ప్రభువు రెండవ రాకడను కూడ రక్షణ రాకడగా సరాళము చేయ ప్రయత్నించారు.  కాని దేవుడు క్రూరమృగమును పంపి ఈ నరులలో కలిగిన మార్పు నిజమైనదా?  కాదా?  అని పరీక్షించగా మరి దినములు జరుగుచుండగా మరి ఏలీయా జరిగించిన క్రమశిక్షణను క్రమక్రమంగా మరలి అందరు అవిశ్వాసులుగా మారగా మిగిలిన కొద్దిమంది పరిశుద్ధులు క్రూరమృగము చేత చిక్కి తనువు చాలించుట జరిగింది.  ప్రకటన 13:4-7, ''ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి.  మరియు వారు-ఈ మృగముతో సాటి యెవడు?  దానితో యుద్ధము చేయగల వాడెవడు?  అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.  డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను.  మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకునుఆయన నామమునుఆయన గుడారమునుపరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.  మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను.  ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనముమీదను అధికారము దానికియ్యబడెను.'' ఘటసర్ప రూపము ధరించిన మృగమునకు అధికారము ప్రభువు ఎందుకు ఇచ్చాడు?  ప్రకటన 3:21  ప్రభువు ఈ లోకాన్ని సాతానును జయించినట్లుగా ప్రతి విశ్వాసి అపవాది శోధనలను వాని బలాత్కారములను జయించి పరలోక రాజ్యములో ప్రభువు సింహాసనములో ఆసీనుడు కావాలన్న తలంపుతోనే విశ్వాసికి సాతానుతో పోరాటం ఏర్పాటు చేశాడు.  ఈ విధముగా పరిశుద్ధులను జయించి వారు భూమిపైన లేకుండ పోవుట వలన ఈ భూమిపై ఏలీయా మరణానంతరము కేవలము నలువదిరెండు నెలలలో అనగా వెయ్యిన్ని రెండువందల అరువది దినములలోనే భూమిపై సరాళము చేయబడిన ప్రభువు మార్గము తిరిగి వారి హృదయాలు ముళ్లకంపలుగానుబండరాళ్లుగాను మారిపోయింది.  ఈసారి క్రీస్తు రెండవ రాకడగా వచ్చుట సమస్త మానవాళిని మరణానికి అప్పగించి తన వాక్యమనే ఖడ్గముచే వధించినట్లుగా ప్రకటన 19వ అధ్యాయములో చదువగలము.  దీని ఫలితము యుగాంతమున చేయబడింది.  ఈ విధముగా ఏలీయా ఒక ప్రవక్తగా రెండుసార్లు క్రీస్తు ప్రభువు రాకడను,ఆయన మార్గమును సరాళము చేశాడుగాని మొదటిసారి సఫలీకృతమైనది.  రెండవసారి సఫలీకృతమైనను క్రీస్తు ప్రభువు వచ్చువరకు అది నిలువలేదు.  కనుక యుగాంతము దేవుని మహా ఉగ్రతా దినముగా వచ్చి సమస్తమును నాశనము చేయుట జరిగింది.

23.  ఇశ్రాయేలీయులలో అనేకమంది విధవరాండ్రు ఉన్న ఏలీయా సారెపతు అను ఊరిలో ఉన్న విధవరాలి వద్దకే పంపబడెను అని క్రీస్తు ప్రభువు చెప్పుట

        లూకా 4:21-28, ''ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.  సమాజమందిరములో నున్నవారందరు ఆయనను తేరి చూడగాఆయన-నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.  అప్పుడందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచుఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి- ఈయన యోసేపు కుమారుడుకాడా?  అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి-వైద్యుడానిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనుసామెత చెప్పికపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమోఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను.  ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరునెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడుఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండిననుఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకేగాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.  మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండిననుసిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని''  ఇందులో ఇశ్రాయేలీయుల మధ్య నజరేతు అను ఊరిలో సమాజమందిరములో ఒక లేఖనమును చదివి అది ఇప్పుడు నెరవేరినదని విపరీతముగా అద్భుతములు జరుగుచున్నవని అవి ప్రభువు తన విషయములో నెరవేరినవని తెలియజేస్తున్నారు.  అయితే ఈ మాటకు వారు ఆశ్చర్యపడగా క్రీస్తు ప్రభువు వారి హృదయాలోచన ఎరిగినవాడు కనుక ఆయనను అద్భుతములు చేయమని మేము వాటిని చూచెదమని వారు అడుగుదురని గ్రహించి ముందుగానే ఇలా చెప్పుట జరిగింది.  నేను చేయు క్రియలు ఆశ్చర్యకరమైనవవి అద్భుతమైనవి మహోన్నతమైనవిగాని అవి అందరికి అనుగ్రహించబడవని వారికి తెలియజేశాడు.  లూకా 4:24.  ఇలా చెప్పుచూనే ప్రవక్త స్వదేశమున గౌరవింపబడడని తెలియజేశాడు.  వారికి ఇంకా సులభముగా అర్థము చేసుకొనుటకు ఏలీయా,ఎలీషాలను ప్రామాణికముగా చేస్తూ వారు చేసిన అద్భుతములు అందరికి కాదని వాటికి పరిధి ఉన్నదని చెప్పుచున్నాడు.  
        ఎలా?  ఏలీయా మూడున్నర సంవత్సరములు కరువును కల్పించుట జరిగింది.  ఈ కాలములో ఇశ్రాయేలీయుల దేశములో అనేకమంది విధవరాండ్రు ఉన్నారని కాని దేవుని ఎన్నికలో ఏలీయా కేవలము సారెపతులోని విధవరాలి వద్దకే పంపబడినట్లు చెప్పుట జరిగింది.  అలాగే ప్రవక్తయైన ఎలీషా కాలములో ఇశ్రాయేలీయుల దేశములో అనేకమంది కుష్ఠురోగులు ఉన్నను సిరియ దేశస్థుడైన నయమాను మాత్రమే శుద్ధి పొందెనని తెలియజేశాడు.  ఇలా అద్భుతములు మహిమాన్విత క్రియలు ఎంతోమంది చూడాలని అడుగుతారుగాని వారికి అనుగ్రహింపబడవని అవి కేవలము ఎన్నిక చేయబడినవారికి మాత్రమే జరుగునని ఇందులోని భావము.  అలాగే క్రీస్తు ప్రభువు కపెర్నహూములో అనేక అద్భుతములు మహిమాన్విత క్రియలు జరిగించెనని విని నజరేతువారు ఆయనను అలాంటివి చూడాలని కోరుకొనక ముందే వారి హృదయా లోచనలు ఎరిగిన క్రీస్తు ప్రభువు వారికి అవి చూచుటకైనను అవి అనుగ్రహింపబడలేదని ఏలీయా కాలములో ఇశ్రాయేలీయులలో సారెపతులోని విధవరాలు తప్ప మిగిలిన విధవరాండ్ర యొద్దకు పంపబడలేదు.  అలాగే ఎలీషా కాలములో వలె సిరియ దేశస్థుడైన నయమాను తప్ప ఇశ్రాయేలీయులలో కుష్ఠురోగులు అనేకులున్నను మీరందరు కూడ అందుకు యోగ్యులుగా లేరని వారికి చెప్పుట జరిగింది.  ఒక అద్భుత క్రియ లేక మహిమాన్విత క్రియ మన జీవితములో జరగాలన్న చూడాలన్న దానికి యోగ్యత అవసరము.  ఆ యోగ్యతే నీతి పరిశుద్ధత.  ఇవి లేనివారు దేవుని చూడలేరు దేవుని కార్యములను చూడలేరు.  ఇలా వారించినందుకు క్రీస్తు ప్రభువు పరిస్థితి ఒక్కసారి గ్రహించాలి.  లూకా 4:28-29, ''సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొనిలేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి,ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి.''  చూచారా!  వారిలోని కాఠిన్యత వారు క్రీస్తు ప్రభువునే చంపజూచారు.
        పాత నిబంధనలో ఏలీయా అనేక అద్భుతములు చేసినను అవన్ని దేవుని కోసము చేసినవి.  జనుల కోసము చేసినది.  ఆహారము లేని సమయములో రక్షణ కోసము అద్భుతము చేసినది ఒక సారెపతులోని విధవరాలి విషయములోనే జరిగింది.  అంటే ఇలాంటి ఆహారము అనుగ్రహించుటచనిపోయిన విధవరాలి కుమారుని లేపుట వంటివి అందరికి అనుగ్రహింపబడవని చెప్పుట జరిగింది.

24.  ఏలీయా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా వాదన

        ఏలీయా అహాబు రాజు కాలములోని ప్రవక్త.  ఆ కాలములో యెజెబెలు అహాబు భార్యగా ఇశ్రాయేలీయులకు రాణిగా ఉండేది.  ఈమె ఇశ్రాయేలీయుల లోని యెహోవా దేవుని ప్రవక్తలను చంపించెడిది.  ఆమెకు ఇశ్రాయేలీయులు సహకరించే వారు.  ఆమె బాలు అను విగ్రహ దేవతకు భక్తురాలు.  ఆమె వలన బాలుకు 450 మంది ప్రవక్తలు ఇశ్రాయేలీయులలో ఎక్కువ భాగము ఆరాధికులుగా మారిపోయారు.  అనేకులు దేవుడైన యెహోవాయే గాక బాలును ఇద్దరిని రెండు రకముల దేవుళ్లుగా తలంచేవారు.  ఇలాంటి స్థితిలో ఇశ్రాయేలీయులలో నిజ దేవుని ప్రవక్తలు చంపబడుట ఇశ్రాయేలీయుల దేశములో జరిగింది.  అలాంటివారికి చిక్కకుండ ఏలీయా దేవుని ప్రవక్తగా ఇశ్రాయేలీయుల దేశములో ఉండేవాడు.  ఇలాంటి ఏలీయా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా దేవునికి ఇలా విన్నవించుచున్నాడు.  1 రాజులు 19:14, ''అందుకతడు- ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి.  సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచు చున్నారని చెప్పెను.'' తను ఒక్కడే ప్రవక్త మిగిలియున్నానని ఇప్పుడు నన్ను కూడ చంపజూచుచున్నారని ఈ స్థితికి కారణము ఇశ్రాయేలీయులని చెప్పుచున్నాడు.  ఇలా ఏలీయా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా దేవునికి ప్రార్థన చేయుట జరిగింది.  ఇదే సంగతిని పౌలు ప్రసావిస్తూ బయలుకు మోకాళ్లూనని ఏడువేల మంది పురుషులు ఇశ్రాయేలీయులలో ఉన్నారని దేవుని కృప వలన వారు మిగిలియున్నారని చెప్పుచున్నాడు.  రోమా 11:2-5, ''తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు.  ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?  ప్రభువావారు నీ ప్రవక్తలను చంపిరి,  నీ బలిపీఠములను పడగొట్టిరినేనొక్కడనే మిగిలియున్నానునా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.  అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది?  బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.  ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.''  ఈ విధముగా దేవుని కృపలో ఆయన ఏర్పాటు చొప్పున ఇశ్రాయేలీయు లలో ఏడువేలమంది పవిత్రులు ఆ కాలములో ఉన్నారని చెప్పబడింది.  ప్రవక్త ప్రార్థనలో నేనొక్కడనే మిగిలియున్నానని అంటే దేవుని దృష్టిలో ఏడువేలమంది ఉన్నారు.  ప్రవక్త దృష్టిలో తానొక్కడే నన్న భావన ఉంది.  కాని దేవుని కనుదృష్టిలో ఏడువేలమంది పరిశుద్ధులు ఉన్నారు.  కనుకనే ఆ కాలములో ఇశ్రాయేలీయుల వినాశనము జరగలేదు.  ఏలీయా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా వాదించినను దేవుని కృప ఇశ్రాయేలీయుల పక్షమున ఉన్నదని తెలియజేయబడింది.  ఈ కారణము చేత ఏలీయా ఇశ్రాయేలీయులందరిని నాశనము చేయకఏడువేలమంది మినహా మిగిలినవారిని నాశనము చేయుటకు సిరియకు రాజునుఇశ్రాయేలీయులకు రాజునుప్రవక్త తన స్థానమున దానిని కొనసాగించుటకు ఎలీషాను దేవుని ప్రణాళిక ప్రకారము ఎన్నుకొనెను.  1 రాజులు 19:15-18, ''అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా-నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుముఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుమునీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.  హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతము చేయునుయెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును.  అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయునోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.''

25.  పాత నిబంధనలో ఏలీయా క్రియలు

        1 రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయములో ఏలీయా ప్రవక్తగా అహాబు రాజు వద్దకు వచ్చి మూడున్నర సంవత్సరములు వానగాని మంచుగాని కురవదని తెలియజేస్తాడు.  అటుతరువాత ప్రభువు వాక్కు ఏలీయాతో నీవు వెళ్లి కెరీతు వాగు వద్ద దాగుకొనుమని చెప్పుట చదవగలము.  అక్కడ కొంతకాలము ఉన్న తరువాత ఆ ఏరు ఎండిపోగ దేవుని ఆజ్ఞతో సారెపతులోని విధవరాలి ఇంటిలో పోషింపబడ్డాడు.  అక్కడ కుండలోని పిండి పిడతలోని నూనె తరిగి పోకుండ దేవుని క్రియ జరిగించగలిగెను.  అటుతరువాత సారెపతులోని విధవరాలి కుమారుడు చనిపోగా ప్రార్థనాశక్తితో ఆ కుమారుని తిరిగి బ్రతికించుట చేయగలిగాడు.  కర్మేలు కొండపై ఏర్పరచిన బలిని ఆకాశము నుండి దైవాగ్నిని దింపి దహించి తనలోని ప్రార్థనాశక్తిని ఇశ్రాయేలీయులకు చూపించాడు.  అటుతరువాత కరువును తన ప్రార్థనతో ఆపగలిగాడు.  నాబోతు ద్రాక్ష తోటను అహాబు భార్యయైన యెజెబెలు అతనిని చంపి లాగుకొనగా ఏలీయా వారిని మరణ పాత్రులుగా శపించి,వారి శవములను శునకములు నాకునని చెప్పగా అహాబు యుద్ధములో మరణించగా అతని శవమును కుక్కలు నాకుట జరిగింది.  అలాగే అహాబు రాజుకు అతని చావును ఏలీయా తెలియజేసెను.  ఏలీయాను పట్టుకొని తీసుకు రమ్మని పంపిన యాభైమంది మరియు నూట యాభైమంది బంటులను రెండుసార్లుగా ఆకాశము నుండి అగ్ని రప్పించి మరి కాల్చివేయుట చేసెను.  క్లుప్తముగా పాత నిబంధన కాలములో ఏలీయా చేసిన క్రియలు ఇవి.  

26.  పాత నిబంధనలో  . . .  ఏలీయాను గూర్చి ఇశ్రాయేలు ఏమనుకొనుచున్నారు - ఇశ్రాయేలీయులను గూర్చి ఏలీయా ఏమనుకొనుచున్నాడు?

        తన కుమారుని మరణ విషయములో సారెపతు విధవరాలి ఆలోచన :-  1 రాజులు 17:18, ''ఆమె ఏలీయాతో-దైవజనుడానాయొద్దకు నీవు రానిమిత్తమేమి?  నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా అని మనవి చేయగా''
        ఏలీయా ఆలోచన :-  1 రాజులు 17:20, ''-యెహోవా నా దేవానన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొఱ్ఱ పెట్టి''
        ఓబద్యా ఆలోచనలో ఏలీయా :-  1 రాజులు 18:9-12, ''అందుకు ఓబద్యా-నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింప నేల?  నేను చేసిన పాపమేమి?  నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు,రాజ్యమొకటైనను లేదుఅతడు ఇక్కడ లేడనియుఅతని చూడలేదనియువారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.  నీవు-నీ యేలినవానిచెంతకు పోయిఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావేఅయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవునుఅప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపివేయునుఆలాగున  ఆజ్ఞ ఇయ్యవద్దు.  నీ దాసుడనైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను.''
        ఓబద్యా పిరికితనమునకు ఏలీయా ఆలోచన :-  1 రాజులు 18:15, ''ఏలీయా-ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానోఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను.''
        అహాబు రాజు ఆలోచనలో ఏలీయా :-  1 రాజులు 18:17, ''అహాబు ఏలీయాను చూచి-ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా''
        అహాబు రాజు ఆలోచనలో ఏలీయా :-  1 రాజులు 21:20, ''అంతట అహాబు  ఏలీయాను చూచి-నా పగవాడానీ చేతిలో నేను చిక్కుబడితినా?  అని పలుకగా ఏలీయా ఇట్లనెను-యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.''
        ఏలీయా ఆలోచనలో అహాబు రాజు :-  1 రాజులు 18:18, ''అతడు-నేను కానుయెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవునునీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.''
        బయలు దేవత విషయములో ఇశ్రాయేలీయుల ఆలోచన :-  1 రాజులు 18:26, ''(బయలు! మా మొర వినుము.) వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసిఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు-బయలామా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగావారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి.''
        బయలు దేవత విషయములో ఏలీయా ఆలోచన :-  1 రాజులు 18:27, ''మధ్యాహ్నము కాగా ఏలీయా-వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడివాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమోదూరమున నున్నాడేమోప్రయాణము చేయు చున్నాడేమోవాడు నిద్రపోవుచున్నాడేమోమీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా''
        ఏలీయా విషయములో యెజెబెలు రాణి ఆలోచన :-  1 రాజులు 19:2, ''యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను-రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.''
        యెజెబెలు రాణి విషయములో ఏలీయా ఆలోచన :-  1 రాజులు 19:3-4, ''కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొనిలేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయియూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరిఅచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండిమరణాపేక్షగలవాడై-యెహోవానా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను,ఇంతమట్టుకు చాలునునా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.''

27.  ఏలీయా - కాకుల సహవాసము

        ఏలీయా చరిత్రలో కాకులతో కొంతకాలము సహవాసము కలిగియున్నట్లుగా వ్రాయబడింది.  ఇలా చెప్పుట కంటే కాకులు ఏలీయాను మంచి తల్లిదండ్రులవలె అవి తిన్నను తినక పోయినను తమ బిడ్డవలె ఆహారమును తెచ్చి ఇచ్చి పోషించాయి.  ఏలీయా చరిత్రలో కాకులు పోషణకర్తలుగా కనిపిస్తాయి.  1 రాజులు17:1 వ వచనములో ఏలీయా మూడున్నర సంవత్సర కాలము కరువును గూర్చి ప్రకటిస్తాడు.  అప్పుడు దేవుని వాక్కు ఏలీయాతో కెరీతు వాగు వద్ద దాగుకొనమని ఆ వాగులోని నీళ్లను త్రాగుమని చెప్పుట జరిగింది.  అంతేకాదు దేవుడు తన ఆజ్ఞ ప్రకారము కాకులు నీకు ఆహారమును తెచ్చునని చెప్పబడింది.  1 రాజులు 17:4-6, ''ఆ వాగు నీరు నీవు త్రాగుదువుఅచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.  అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను;అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.''  ఈ ఆజ్ఞను పొందిన కాకులు పోషణకర్తలుగా ఏలీయాకు అనుదిన ఆహారముఏ రోజుకి ఆ రోజు తెచ్చి ఇచ్చాయి.  ఇందులో ఏలీయా ఉదయము ఒక రొట్టె కొంత మాంసము అలాగే సాయంత్రం ఒక రొట్టె కొంత మాంసము తిని జీవించాడు.  ఈ ఆహారమును దేవుడు కాకులకు ఆజ్ఞ ఇయ్యగా తెచ్చి ఇచ్చినవి.  దేవునికి ఒక మధ్యవయస్కుడు ఎంత తినాలో తెలుసుఎంత తింటే ఆరోగ్యముగా ఉంటారో తెలుసు కనుకనే ఒక రోజుకు రెండు రొట్టెలుకొంత మాంసమును మాత్రమే ఇచ్చాడు.  అంతేగాని రోజంతా ఏదో ఒకటి తిని అనారోగ్యము పాలు కమ్మని ఆహారమును ఇయ్యలేదు.  రోజుకి రెండు పూటల మాత్రమే ఇచ్చి పోషించాడు.  అంటే కాకులు ఈ విధముగా ఏలీయా ఆరోగ్యము చెడిపోకుండ ఎంత ఆహారము తినాలో అంతే అనుగ్రహించుట దేవుని ఆజ్ఞను పొంది నెరవేర్చాయి.  నోవహు చరిత్రలో కాకిని వెలుపలికి ఓడ నుండి వదలగావాటికి కాలు మోపు స్థలము కనిపించగానే వెళ్లిపోయాయి.  తిరిగి రాలేదు.  అంటే అవి స్వతంత్ర జీవులు.  అంతే కాకుండ కాకి పిల్లల చేతిలోని ఆహారమును ఇంటి పెరటిలో ఆరబెట్టిన ముక్కలను చాలా చాకచక్యముగా ఎత్తుకొని పోగలవు. ఆ విధముగా వాటిలో చాకచక్యమును ఉపయోగించి ఏలీయాకు ఆహారమును కాలమును బట్టి అందించేవి.  ఈ విధముగా కొంతకాలము అనగా కెరీతు వాగు ఎండిపోవు వరకు అక్కడ పోషింపబడుట మనము చదవగలము.  అటుతరువాత ఏలీయా సారెపతులో విధవరాలి దగ్గర రొట్టెను పై విధముగా తిని జీవిస్తూ వచ్చాడు.  ఇలా ఎంతకాలము?  మూడున్నర సంవత్సరముల కరువు కాలమున జీవించినట్లుగా వ్రాయబడింది.  అంటే మనము ఎంత తక్కువ ఆహారమును భుజించుదుమో అంత ఆరోగ్యమును పొందుట జరుగును.  మితముగా తినాలి ప్రతిరోజు తినాలి.
        అలాగే ఏలీయా బయలు ప్రవక్తలను నాలుగువందల యాభైమందిని వధింప జేసెనని విని యెజెబెలు ఏలీయాను చంపింతునని ప్రమాణము చేయగా ఆమెకు భయపడి పారిపోవుట అడవిలో అలసి ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రార్థన చేయుచూ తన ప్రాణము విడుచుదునని దేవుని కోరుటను గూర్చి 1 రాజులు 19:4-6లో చదవగలము.  అక్కడ దేవదూత ద్వారా పోషింపబడినాడు.  1 రాజులు 19:5-8, ''అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి-నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను.  అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను.  అయితే యెహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి-నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నదినీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసిఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి,దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి''  దేవుని దూత ఇచ్చిన ఆహారము ఏలీయాకు నలువది దినములు నడచు శక్తిని ఇయ్యగా కాకులు తెచ్చిన ఆహారము ప్రతిరోజు రెండు పూటల తినవలసి వచ్చింది.  అంటే ఈ లోక సంబంధమైన ఆహారము క్రమముగా తినదగినంత మాత్రమే తినాలని గుర్తించాలి.  ఈ విధముగా ఏలీయా విషయములో ఏలీయాకు కాకుల సహవాసము ఈ లోక ఆనవాయితీకి విరుద్ధమైనది.  అయినను దేవుని ఆజ్ఞకు లోబడి తమ విధేయతను చూపినట్లుగా గ్రహించాలి.

28.  ఏలీయా ప్రవక్తగా తన వారసుని అభిషేకించుట

        1 రాజులు 19:15-16, ''అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా-నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుముఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుమునీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.''  ఈ విధముగా ప్రభువు వాక్కు ఏలీయాకు తెలియజేయగా రాజులుగా వారిని తన ప్రవక్తగా వారసునిగా ఎలీషాను ఎన్నుకొనెను.  1 రాజులు 19:19-21, ''ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను.  అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను.  ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతనిమీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి-నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు-పోయిరమ్మునావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.  అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసివధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను.  వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.''  ఈ విధముగా రోమా 12:1లో చెప్పబడినట్లు ఎలీషా తనకున్న సమస్తమును సజీవ యాగముగా ప్రభువు కొరకు సమర్పించుకొని ఏలీయా వారసత్వము పొందగలిగెను.  ఈ విధముగా ఏలీయా ఎలీషాను తన శిష్యునిగా చేసుకొని అతనిని తనకు వారసునిగా తన తరువాత ప్రవక్తగా ఎన్నిక చేయుట జరిగింది.

29.  ఏలీయా - సుడిగాలి ప్రయాణము

        2 రాజులు 2:1, 3, 5, ''యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా  . . .  బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి-నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు-నేనెరుగుదునుమీరు ఊరకుండుడనెను.  . . .  యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి-నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు-నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను.''  ఈ విధముగా ఏలీయా విషయముగా ప్రవక్తలు ముందుగానే ప్రవచించుట జరిగింది.  ఆ సమయము ఆసన్నమైనప్పుడు అందరు గుర్తు చేస్తున్నారంటే ఏలీయా ఆరోహణమయ్యే సంగతి ఆనాటి జనులలో ఇంచుమించు అందరికి తెలిసియే ఉండును.  అలాగే ప్రవక్తలు సుమారు మూడు ప్రాంతములవారు ఎలీషా దగ్గరకు వచ్చి గుర్తు చేయుట గమనించాలి.  గుర్తు చేయుటఏలీషా తన ఏలీయా ముందు ఊరకుండుడని చెప్పుట జరుగుతూ వచ్చింది.  ఇలా భవిష్యత్‌ గూర్చి ఏలీయా జీవితము ముడిపడి ఉన్నది.  తాను సుడిగాలిలో ఆరోహణమయ్యే సంగతి ముందుగానే చెప్పబడింది.  అలాగే క్రీస్తు ప్రభువుకు ముందు అనగా నూతన నిబంధనలోయుగాంతానికి ముందు వస్తాడని క్రీస్తు మార్గము సరాళము చేయునని భవిష్యత్తుగా చెప్పబడింది.  సుడిగాలి ప్రయాణము పాత నిబంధనలోని వారికి జరగబోవు భవిష్యత్తు.  2 రాజులు 2:11-12, ''వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెనుఅప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను.  ఎలీషా అది చూచి-నా తండ్రీ నా తండ్రీఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెనుఅంతలో ఏలీయా అతనికి మరల కన బడకపోయెను.  అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.''  ఈ విధముగా అగ్నిరథములపై సుడిగాలిలో ప్రయాణమై ఆరోహణమై మధ్యాకాశములో ఉన్నాడు.  2 కొరింథీ12:3లో వలె పరదైసులలోనికి కొనిపోబడినట్లు తెలుస్తున్నది.

చివరిగా ఒక మాట

ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  
  1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,
  2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,
  3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,
  4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,
  5. మీ హృదయము నుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే, ''దయవుంచి నాకు వ్రాయండి.'' (email: FaithScope@thamu.com)
        దీని వలనమేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు: 
  1. ఏడు అను సంఖ్యలోని సర్వసంపూర్ణత  
  2. లోకానికి బైబిల్‌ సవాల్‌ - పార్ట్‌ 1-5
  3. మరణము తరువాత  
  4. నా ప్రభువు తల్లి
  5. ఏదెనులోని దైవప్రణాళిక  
  6. సున్నతి - బాప్తిస్మము  
  7. దేవుని దూతలు - వారి పరిచర్యలు
  8. జేసునాథుని దివ్య వాక్కులు  
  9. ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు  
  10. ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో
  11. పరమగీతము
  12. సాటి సహాయిని
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.